దివ్యాంగులకు ప్రభుత్వం అండ
జగిత్యాల: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మనోధైర్యంతో ముందుకు సాగాలని, హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే మొదటిసారిగా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు అందజేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అలాగే వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు. ప్రతి లబ్ధిదారుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ మాట్లాడుతూ దివ్యాంగుల ముఖంలో సంతోషం చూడాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అభినందనీయమని అన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


