బీమాతో ధీమా
జగిత్యాలరూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు మరింత భరోసా కల్పిస్తూ.. ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం పొందే సౌలభ్యం కల్పించింది. దీనిపై జిల్లాలో సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో 15,229 సంఘాలు
జిల్లాలో 18 మండల సమైక్య సంఘాలు, 565 గ్రామ స మైక్య సంఘాలు, 15,229 స్వశక్తి సంఘాలున్నాయి. ఇందులో 1,77,620 మంది సభ్యులు ఉన్నారు. వీరు సీ్త్రని ధి తో పాటు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ స్వ యం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, ఉపాధి అవకాశాలు నెలకొల్పి, ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరుగనుంది.
ప్రమదవశాత్తు మరణిస్తే రుణమాఫీ..
మహిళలు స్వశక్తి సంఘంలో ఉండి ఏదైనా సహజ మరణం చెందితే వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10 లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి, రూ.5 లక్షలు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే, వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబసభ్యులు, సంఘం సభ్యులపై పడేది.
బీమాకు అర్హులు వీరే..
గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 59 ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకున్న వారు మరణిస్తే.. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది.
జిల్లాలోని మండల సమైక్యలు 18
గ్రామ సమైక్య సంఘాలు 564
స్వశక్తి సంఘాలు 15,299
స్వశక్తి సంఘ సభ్యులు 1,77,620


