పార్టీల సర్వే బాట
జగిత్యాల: సంక్రాంతి పండుగ అనంతరం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్నట్లు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఓటర్ల తుది జాబితా కూడా విడుదల కావడంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చనే ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపిక పనిలో పడ్డాయి. కౌన్సిలర్ పదవికి ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయనే కోణంలో సర్వేలు చేయిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. వార్డుకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నా యి. అన్ని బల్దియాల్లోనూ జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ప్రతి ము న్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఉంటుందని భావి స్తున్నారు. కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహులు ఇప్పటికే మహిళాసంఘాలు, కులసంఘాలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన పార్టీలు కూడా అ భ్యర్థులకు తెలియకుండా ఎవరిని బరిలో దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయనే కోణంలో సర్వే చేస్తున్నాయి.
ఇప్పటి నుంచే ప్రచారం...
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు వారి వార్డుల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. వార్డుల్లో ప్రధానంగా ఏ సమస్యలున్నాయి..? అని స్వయంగా ఆరా తీస్తున్నారు. మహిళా సంఘాలను కలుస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. కుల సంఘ పెద్దలను కూడా కలుస్తున్నారు. బీడీ కార్మికులు, ఇటీవల ఓటు హక్కు వచ్చిన యువత మద్దతు కోరుతున్నారు. అధికార కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకోవడంతో అదే విధంగా మున్సిపల్‌లోనూ అత్యధికంగా సీట్లు గెలుచుకోవడానికి దృష్టి సారించింది. మరోవైపు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసేందుకు బీఆర్‌ఎస్ భారీగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. మున్సిపల్‌లో పాగా వేసేలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ గతంలో కొన్ని సీట్లకే పరిమితమైనప్పటికీ ఈసారి మున్సిపల్ చైర్మన్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై చూస్తే..
అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. ప్రజలు అభివృద్ధి సంక్షేమంపై చూస్తే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు పరిశీలిస్తూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అత్యధికంగా ఉంటే గెలుపోటములపై ప్రభావితం చూపుతాయి. ఏదేమైనా మున్సిపల్‌లో పాగా వేయాలని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
రిజర్వేషన్లపై ఆసక్తి
ఒకవైపు ప్రధాన పార్టీలను అభ్యర్థులు కలుస్తూ టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతోపాటు ఒకవేళ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆశావహులు ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్లు వస్తే టికెట్లు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు అనుకూలించకపోతే పతి స్థానంలో సతులను నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.


