ఇంటింటికీ నల్లానీరు అందేదెప్పుడో..?
కథలాపూర్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయమని పాలకులు, అధికారులు ప్రసంగాల్లో అదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరించడం లేదన్న విమర్శలున్నాయి. కథలాపూర్ మండలం ఇప్పపెల్లి, ఊట్‌పెల్లి గ్రామాల్లో నల్లానీళ్లు రాక ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కరించకపోవడమే దీనికి నిదర్శనం. ఫలితంగా ప్రజలు నీటికోసం ఇక్కట్లపాలవుతున్నారు. నీటికోసం ఆయా వాడల్లో ఉన్న బోరుబావులను వినియోగించుకుంటున్నారు. నల్లానీళ్లు రాని పరిస్థితి ఏళ్లుగా ఉందని తెలిసినప్పటికీ అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి నల్లానీరు వచ్చేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అలంకారప్రాయంగా ట్యాంకులు.. బోరుబావుల నీరే దిక్కు
మండలంలోని 19 గ్రామాలకు మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం నుంచి ప్రత్యేకంగా పైపులైన్ వేశారు. ఈ పైపులైన్ ద్వారా మండలంలోని అన్ని గ్రామాల రక్షిత మంచినీటి ట్యాంకులను నీటితో నింపడం లక్ష్యం. ట్యాంకుల నుంచి వాడవాడకు పైపులైన్ వేసి ఇంటింటికీ నల్లానీరు అందించాల్సి ఉంటుంది. మండలంలోని ఇప్పపెల్లి, ఊట్‌పెల్లి గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులకు మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా నీళ్లందిస్తున్నారు. ఇంటింటికీ నల్లానీరు మాత్రం రావడంలేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ సమస్య ఏళ్లుగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని మండిపడుతున్నారు. గ్రామాల్లో పైపులైన్ అస్తవ్యస్థంగా ఉన్నప్పటికి మరమ్మతు చేయించడంలేదని వాపోతున్నారు. రెండు గ్రామాల్లో నాలుగు రక్షిత మంచినీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయని అంటున్నారు. ఇప్పటికై నా గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు స్పందించి పైపులైన్‌ను సరిచేసి ఇంటింటికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


