ఆచీతూచి అడుగులు..!
కోరుట్ల: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరి గుర్తు వారికే. ఎవరు గెలిచినా మనవైపు తిప్పుకోవచ్చని సరిపుచ్చుకున్న ప్రధాన పార్టీల నాయకులకు అసలు సిసలు పరీక్షగా మారాయి మున్సిపల్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండటంతోపాటు ఆయా పార్టీల కీలక నేతలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిన ఆవశ్యం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీల కీలక నేతలు పక్కాగా వ్యవహరిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతీ అభ్యర్థి ఎంపిక ఆచీతూచి జరిగేలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి.
అధికార పార్టీలో దరఖాస్తుల స్వీకరణ
అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున పోటీచేయదలిచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. దీంతో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో బరిలో ఉండదలచిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం పార్టీ నుంచి ప్రత్యేక సర్వే టీం వచ్చి వార్డుల్లో వారి పరిస్థితి ఏంటి..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..? అనే అంశంపై ఆరా తీయనున్నట్లు సమాచారం. తరువాత గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కీలక నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని సర్వేలో ఏం తేల్చబోతున్నారనే ఉత్కంఠలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ సర్వే జరుగుతుందన్న అభిప్రాయాలు కొంతమందిలో ఉండగా.. సర్వే అంతా ఉత్తిదే.. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఎంపిక మాత్రమే ఫైనల్ అని మరి కొంత మంది అభ్యర్థులు లోలోన ప్రచారం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్.. బీజేపీ కసరత్తు
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థులను నిలపడంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఆచీతూచి వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీకి ప్రయత్నిస్తున్న అభ్యర్థుల బయోడాటాను పార్టీ వర్గాల నుంచి స్వీకరించి వారి స్థితిగతులపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న నేతల కనుసన్నలతోపాటు గెలుపు విషయంలో కాస్త ముందుండే అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ గుర్తులతో అభ్యర్థుల పోటీ కావడంతో మంచి పేరుతో పాటు కాస్తంత ఖర్చు పెట్టగల అభ్యర్థులు కోసం వెతుకుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక బూత్ కమిటీ ప్రతినిధుల నుంచి సమాచార సేకరణ, వార్డుల్లో పోటీకి నిలబడటానికి ఉత్సుకత చూపుతున్న వారి వివరాలు.. వారితో ప్రజలకు ఉన్న సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీకి ప్రజల్లో పట్టు ఉన్నప్పటికీ సరైన అభ్యర్థులను బరిలో నిలిపితే మున్సిపాలిటీల్లో గతంలో ఉన్న పరిస్థితి మరింత మెరుగు అవుతుందన్న ఆశల్లో కీలక నేతలు ఉన్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద పార్టీ కీలక నేతలకు ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది.
పురపోరుకు ప్రధాన పార్టీల కసరత్తు
ఇప్పటికే దరఖాస్తుల స్వీకరిస్తున్న వైనం
గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక


