పొలాలకు చేరని ‘వరద’ నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఓ వైపు కాకతీయ కాలువ, మరోవైపు వరదకాలువ జిల్లామీదుగానే ప్రవహిస్తాయి. కాకతీయ కాలువ ద్వారా మెజార్టీ మండలాలకు సాగునీరు అందుతున్నా.. వరదకాలువ ద్వారా ఒక్క గ్రామానికీ సాగునీరు అందే పరిస్థితి లేదు. వరదకాలువ ఎప్పుడూ నీటితో కళకళలాడుతున్నప్పటికీ సాగునీరు మాత్రం రైతుల పొలాలకు చేరడం లేదు.
ఆయకట్టేతర రైతుల ఇబ్బంది
మేడిపల్లి, భీమారం, కథలాపూర్, మల్యాల, కొడిమ్యాల మండలాలు పూర్తిగా.. కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు ఆయకట్టేతర ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల మీదుగా కాకతీయ, వరదకాలువలు సుమారు 25 నుంచి 50 మీటర్ల లోతులో ఉంటాయి. ఈ గ్రామాలకు కాకతీయ, వరదకాలువకు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేసినప్పటికీ సాగు నీరు అందదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయ బావులు, బోర్లు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వైఎస్సార్ హయాంలో వరదకాలువ
వర్షాలు ఎక్కువై.. ఎస్సారెస్పీ నిండితే గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలువకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వరదకాలువ చేపట్టారు. ఈ కాలువ జిల్లాలో దాదాపు 58 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్, మేడిపల్లి మండలాల మీదుగా వెళ్తుంది.
ప్రతిపాదనలకే పరిమితమైన నివేదికలు
దాదాపు రూ.805.31 కోట్లతో 54,215 ఎకరాలకు సాగునీరు అందేలా అఽధికారులు, ప్రజాప్రతినిధులు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు రూ.763.31 కోట్లతో కథలాపూర్ మండలం దుంపెట, మేడిపల్లి మండలం మోత్కురావుపేట, వరదకాలువ 47.600 కిలోమీటర్, 67.500, అలాగే 59.500 వద్ద ఎత్తిపోతల పథకాలు, మల్యాల మండలం మద్దుట్ల, గొర్రెగూడెం వద్ద రెండు పంపుహౌస్‌లు, వరద కాల్వ 62 కిలోమీటర్ నుంచి 65.20 కిలోమీటర్ వరకు కాలువ లైనింగ్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. అవి అతీగతి లేకుండా పోయాయి.
పక్క నుంచే కాకతీయ, వరదకాలువ
ప్రతిపాదనలకే పరిమితమైన పంప్‌హౌస్‌లు
ఆయకట్టేతర మండలాల రైతుల ఇబ్బందులు
ఎత్తిపోతలే ఆధారం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి రైతుల విజ్ఞాపన మేరకు వరదకాలువకు ఎడమ వైపు 49 తూములు నిర్మించింది. వాటి ద్వారా చెరువుల్లోకి నీటిని తరలించి దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరదకాల్వకు రెండుమూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతులు కాలువకు మోటార్లు బిగించి, పైపులైన్‌లు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు. దీంతో నాన్ ఆయకట్టు రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మేడిపల్లి, కథలాపూర్ మండలాల రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎత్తిపోతల పథకాలపై చర్చించారు. వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా చిన్నపాటి రిజర్వాయర్లు.. లేదంటే నాలుగైదు గ్రామాల మధ్య ఉండే చెరువులకు నీరు అందేలా చూడాలని భావించారు.


