సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌

Jul 31 2025 7:40 AM | Updated on Jul 31 2025 8:28 AM

సైబర్

సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌

జన్నారం కేంద్రంగా కార్యకలాపాలు

కాంబోడియా దేశం నుంచి సూచనలు

వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్‌

జన్నారం: జన్నారం కేంద్రంగా సైబర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సైబర్‌ నేరాలకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ ఆయన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్‌లో పనికి కుదిరాడు. బాపయ్యకు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్‌ జాక్‌ ఉరఫ్‌ రాజు విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుండగా 2023లోనే ఛండీఘర్‌లో పరిచయమయ్యాడు. 2024లో రాజు కాంబోడియా వెళ్లి బాపయ్యను రెస్టారెంట్‌లో కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్‌లో బాపయ్యను సాయికృష్ణ సంప్రదించి.. జన్నారం ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్‌తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్‌లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా సామగ్రి పంపిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్‌కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్‌ సామగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. తర్వాత నెట్‌ కనెక్షన్‌, ఇన్వర్టర్‌, ల్యాప్‌టాప్‌ సమకూర్చుకున్నారు. తాను చెప్పినట్లు చేయాలని, ఇందుకు నెలకు రూ.30వేల చొప్పున ఇస్తానని, పైగా వచ్చిన సొమ్ములో వాటా కూడా ఇస్తానని బాపయ్య, మధుకర్‌, గొట్ల రాజేశ్‌ను సాయికృష్ణ పనికి కుదుర్చుకున్నాడు. వీరితోపాటు అప్పటికే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్‌ను నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్‌కు ఢిల్లీలోని ఓ వీల్స్‌ కంపెనీలో డీజిల్‌ సేల్స్‌లో అకౌంట్‌ కీ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్‌, గొట్ల రాజేశ్‌, కామేశ్‌ కలిసి అద్దె గదిలో డీలింక్‌ రూటర్లు, ల్యాప్‌టాప్‌, సిమ్‌ ప్యానల్‌ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఆధారాలు లేని సిమ్‌కార్డులు 350 కొనుగోలు చేశారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్‌ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్‌లో సిమ్‌లు అమర్చి, కొంత సమయం తర్వాత తీయడం, కొత్త సిమ్‌లు పెట్టడం చేస్తూ ఉండేవారు. సిమ్‌బాక్స్‌ పరికరాలు ఏర్పాటు చేసి వివిధ రకాలైన ఐఎంఈఐ నంబర్లు, లింకులు తయారు చేసి సైబర్‌ నేరాలు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు.

పట్టుబడింది ఇలా..

ఢిల్లీకి చెందిన టెలి కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వీరి బండారాన్ని గుర్తించింది. రామగుండం సైబర్‌ క్రైం, పోలీసులు టెక్నికల్‌ సహాయంతో బుధవారం కలమడుగు చేరుకుని సోదాలు నిర్వహించారు. సోదాల్లో కామేశ్‌, భావు బాపయ్య, మధుకర్‌, గొట్ల రాజేశ్‌ పట్టుబడ్డారు. వారిని అరెస్ట్‌ చేసి సైబర్‌ నేరాలకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్‌ లింక్స్‌ ఉన్నందున లోతైన విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సైబర్‌ క్రైం డీసీపీ వెంకటరమణరెడ్డి, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, టెలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అలెన్‌, అనురాగ్‌, సైబర్‌ క్రైమ్‌ సీఐలు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, ఎస్సైలు గొల్లపెల్లి అనూష, సురేశ్‌, తహసీనోద్దీన్‌ను రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ అభినందించారు.

సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌1
1/1

సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement