
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు.
● ఆహ్లాదకర వాతావరణంలో..
కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు.
● తేలికపాటి కుండీల ఎంపిక
డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్‌తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు.
● గ్రోబ్యాగ్స్ అనుకూలం
గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి,
● మొక్కల ఎంపిక ప్రధానం
డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్‌నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు.
● నీటి యాజమాన్యం కీలకం
దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది.
రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు
అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం
కొన్నేళ్లుగా సాగు చేస్తున్న
కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను.
– సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల
చాలా కూరగాయలు పెంచొచ్చు
ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం.
– స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల

డాబాపై కూరగాయల సాగు

డాబాపై కూరగాయల సాగు

డాబాపై కూరగాయల సాగు