
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్‌గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్‌గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్‌మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు