
సాక్షి, జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యాప్ తీసుకొస్తే.. ఆ యాప్‌ను ఎడాపెడా తమకు ఇష్టానుసారం వాడేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో బయటపడ్డ వ్యవహారం ఉన్నతాధికారుల్నే అవాక్కై నోట మాట రాకుండా చేసింది.
జగిత్యాలలో ఓ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న వైనం వెలుగు చూసింది. పంచాయితీ కార్యదర్శుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే అటెండెన్స్ నమోదుకు అవకాశం కల్పించింది.

అయితే అందులో కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో ఓ పంచాయితీ కార్యదర్శి మాత్రం నిత్యం విధులకు రాకుండా ఆ యాప్‌లో సీఎం ఫొటోను అప్‌లోడ్ చేశాడు. అది చూసి అధికారుల నోట మాట రాలేదు.
ఈ సార్‌లాగే.. మరికొందరు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు మరికొందరు విధులను ఎగ్గొట్టి ఇతరుల సాయంతో అటెండెన్స్‌ను నమోదు చేసుకుంటున్నట్లు తేలింది. చివరికి.. ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్న తీరుపైనా విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: హైకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట