సింహం ధైర్యం..! | - | Sakshi
Sakshi News home page

సింహం ధైర్యం..!

Feb 3 2026 7:41 AM | Updated on Feb 3 2026 7:41 AM

సింహం ధైర్యం..!

సింహం ధైర్యం..!

20 స్థానాల్లో బీఎస్పీ పోటీ

అత్యధిక స్థానాలు గెలుస్తాం

ప్రత్యామ్నాయ పార్టీలుగా ఏఐఎఫ్‌బీ, బీఎస్పీ

రెబల్స్‌కు కలిసి వస్తున్న సెంటిమెంట్‌

ఆఖరి నిమిషాల్లో ఆపద్బాంధవ పార్టీలు

ఈ సారి తెరమీదకు జనసేన, ఇతర పార్టీలు

ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారుతున్న ప్రత్యామ్నాయ గుర్తులు

ఏనుగు బలం..

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్‌బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్‌ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి.

ముందస్తు వ్యూహాలు

టికెట్‌ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్‌బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్‌ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్‌బీ, బీఎస్పీ పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్‌బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

ప్రధాన పార్టీలకు సవాల్‌

ఏఐఎఫ్‌బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్‌ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్‌ కలిసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది.

సెంటిమెంట్‌ ఏఐఎఫ్‌బీ

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్‌ బ్లాక్‌ గెలుచుకుంది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కైవసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్‌ 3, జగిత్యాల 1, రాయికల్‌లో 2 స్థానాల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు.

బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్‌ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజూరాబాద్‌లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తోంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం.

– నల్లాల శ్రీనివాస్‌,

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ వైపు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్‌ బ్లాక్‌ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం

– అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement