ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
జగిత్యాల: ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఎన్నికల అబ్జర్వర్ కాళీచరణ్ సుదామారావు అన్నారు. సోమవారం ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో పీవో, ఏపీవోలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు రోజు సామగ్రి సేకరించుకుని మరోసారి సరిచూసుకోవాలన్నారు. ఓటరు లిస్ట్, బ్యాలెట్ పేపరు చెక్ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్స్ ఎలా సీల్ చేయాలి..? చాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం వంటి అంశాలపై తెలిసి ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించే బాధ్యత పీవో, ఏపీవోలపైనే ఉంటుందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్‌రెడ్డి, రాము పాల్గొన్నారు.


