కోరుట్లలో నవోదయ!
● ఎంపీ అర్వింద్ చొరవ ● జిల్లా నేతల ఆశలు గల్లంతు
కోరుట్ల: కోరుట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యాసమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. స్కూల్ ఏర్పాటుకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరుట్లలో ఉన్నట్లు ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యాసమితికి నివేదించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కాగా.. వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివారులోని సంగెం రోడ్డు వెంట ఉన్న జంబిగద్దె వద్ద ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి అయినట్టు సమాచారం.
ఏర్పాటుకు సర్వే పూర్తి
కోరుట్ల శివారులోని జంబిగద్దెల సమీపంలో ఉన్న సుమారు 30ఎకరాల ప్రభుత్వ స్థఽలంలో నవోదయ స్కూల్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి, కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు నవోదయ విద్యాసమితికి ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ.. ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైలే, వసతి కోసం కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
జిల్లా నేతల ఆశలు గల్లంతు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సుమారు మూడు నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంబన నెలకొంది. నవోదయ విద్యా సమితి అధికారులు జగిత్యాల జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలో నవోదయ ఏర్పాటుకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నయోనని సర్వేలు నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఫలితంగా కోరుట్లలో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లు తెలిసింది.


