నీరు రాదు.. పంట పండదు
సదర్‌మట్ నిర్మాణంతో గంగనాల వెలవెల ఇప్పటికీ నారు పోయని ఆయకట్టు రైతులు అదును దాటుతోందని ఆందోళన సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం
ఇబ్రహీంపట్నం: మండలంలోని గంగనాల ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీరు రాక ఆ ప్రాంత రైతులు ఇప్పటికీ నార్లు కూడా పోసుకోలేదు. వేములకుర్తి శివారు గోదావరి నదిపై అప్పటి భారీ నీటి పారుదలశాఖ మంత్రి నర్సింగరావు గంగనాల ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా వచ్చే నీటితో మండలంలోని వేములకుర్తి, యామపూర్, ఫకీర్‌కొండాపూర్, మల్లాపూర్ మండలం మొగిలిపేట పెద్ద చెరువులోకి నీటిని తరలించి అక్కడి నుంచి నడికుడ, సంగెంశ్రీరాంపూర్, దామ్‌రాజ్‌పల్లి గ్రామాల్లోని సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అంది రైతులు వానకాలం, యాసంగిలో పంటలు పండించుకునేవారు.
వైఎస్సార్ హయాంలో..
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా గంగనాల నుంచి మాటుకాలువ వెడల్పు చేసి ఇరువైపులా సిమెంట్ లైనింగ్ చేపట్టి ఆ యకట్టు పెంచేందుకు రూ.20 కోట్లు మంజూరు చే శారు. ఆ నిధులతో 20కిలోమీటర్ల మేర కాలువ వె డల్పుతోపాటు సిమెంట్ లైనింగ్ వేసి ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని సుమారు 5వేల ఎకరా లకు సాగునీరు అందుతుండేది. ఆయకట్టు రైతు లు వానకాలం, యాసంగి పంటలు పండించుకునేది.
సదర్‌మాట్ ప్రాజెక్టుతో గంగనాలకు గడ్డుకాలం
గంగనాల ప్రాజెక్టు ఎగువన.. గోదావరిపై మూలరాంపూర్ శివారులో నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామాన్ని కలుపుతూ 2017లో సదర్‌మాట్ ప్రాజెక్టుకు అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచే గంగనాలకు గడ్డుకాలం మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరిలో ఉన్న రాళ్లను గంగనాల వైపు వచ్చే నీటికి అడ్డుగా వేశారు. దీంతో గంగనాలకు నీరు చేరడం లేదు. విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ కోరుట్ల నియెజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుకు ఆయకట్టు రైతులు మొరపెట్టుకోగా.. సదర్‌మట్‌కు ప్రత్యేకంగా గేట్లు అమర్చి గంగనాలకు నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సదర్‌మట్ ప్రారంభానికి సిద్ధంగా ఉండడంతో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 3న ఆయకట్టు రైతులు ధర్నా చేసి ఏఈ కవితకు వినతిపత్రం ఇచ్చారు. ఆ సమయంలో కొద్దిపాటిగా నీరు విడుదల చేయగా రైతులు నార్లు పోశారు. నీటి విడుదల నిలిపివేయడంతో ప్రస్తుతం నాట్లు వేసేందుకు నీరు లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం ఇలా..
సదర్‌మట్ పూర్తికావడంతో గంగనాలకు నిరంతరం నీరు వచ్చేలా ప్రాజెక్టుకు రెండుగేట్లను ఏర్పాటు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. లేకుంటే గంగనాల ఆయకట్టు బీడుగా మారి రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు.
సీఎంకు విన్నవించేందుకు సిద్ధం
సదర్‌మట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈనెల 16 న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశాలు ఉండటంతో గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీరు వ చ్చేలా చూడాలని కోరేందుకు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల రైతులు సిద్ధం అవుతున్నారు.
వెలవెలబోతున్న గంగనాల ఆయకట్టు
గంగనాల గేట్ల వద్దకు కొద్దిపాటిగా వస్తున్న నీరు
నీరు రాదు.. పంట పండదు


