ఇచ్చినా.. ఇవ్వనట్లే!
కోరుట్ల: అలా ఇచ్చి.. ఇలా లాగేసుకున్నట్లుగా మారింది వ్యవసాయ పనిముట్ల ఆధునీకరణ పథకం తీరు. కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్‌ఎంఏఎం) కింద రైతులకు సబ్సిడీ కింద అధునిక పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది మార్చి నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. బడ్జెట్ వినియోగ కాలపరిమితి మార్చితో ముగియడంతో సదరు పథకం అమలుకు అధికారులు ముందడుగు వేసేలోపు నిధులు లాప్స్ అయ్యాయి. సబ్సిడీ విషయంలోనూ రైతులకు సరైన లబ్ధి లేకపోవడంతో పథకలు అమలులో నీరుగారిపోయింది.
అలా ఇచ్చి.. ఇలా లాగేశారు
చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ట్రాక్టర్, హార్వేస్టర్, రోటవేటర్‌తో పాటు సుమారు 30రకాల వ్యవసాయ పరికరాలను యాబై శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా గతేడాది ఎస్‌ఎంఏఎం పథకానికి రూపకల్పన చేసింది. మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తూ రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారిని లబ్ధిదారులుగా గుర్తించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసే విధానాన్ని ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ అవసరమైన ప్రచారం, అవగాహన కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాల వ్యవసాయ విస్తీర్ణం ఆధారంగా అవసరమైన నిధులను ఈ ఏడాది మార్చి నెలాఖరులో ఒక్కో జిల్లాకు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు విడుదల చేసింది. జగిత్యాల జిల్లాకు రూ.67లక్షలు మంజూరయ్యాయి. ఈ పథకంపై వ్యవసాయశాఖ అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే మార్చి నెల బడ్జెట్ కాలపరిమితి ముగియడంతో సదరు నిధులు లాప్స్ అయ్యాయి. నిధుల మంజూరుకి బడ్జెట్ కాలపరిమితి ముగియడానికి మధ్య కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఎస్‌ఎంఏఎం పథకం రైతులకు అందని ద్రాక్షగా మారింది.
సబ్సిడీ తిరకాసు
ఈ పథకంలో సబ్సిడీ విషయంలో కొంత తిరకాసు ఉండటంతో ఆశించిన రీతిలో దరఖాస్తులు రాలేదు. సాధారణంగా ఏదైనా వ్యవసాయ పనిముట్టు మార్కెట్ ధరలో యాభైశాతం సబ్సిడీ ఇస్తే రైతులు ఆసక్తిగా దరఖాస్తు చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం కోట్ చేసిన వ్యవసాయ పరికరాల ధరలు ఎక్కువగా చూపి వాటిలో సబ్సిడీ కింద యాభైశాత కోత పెట్టినట్లుగా రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు రోటవేటర్ ధర మార్కెట్‌లో రూ.85వేల నుంచి రూ.95 వేలు ఉండగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎస్‌ఎంఏఎం పథకం కింద రోటవేటర్ ధర రూ.1.50 లక్షలుగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ ధరతో రోటవేటర్ తీసుకుంటే సబ్సిడీ కింద సగం ధర అంటే రూ.75 వేలకు రోటవేటర్ రైతుకు దక్కుతుంది. మార్కెట్ ధరను లెక్కలోకి తీసుకుంటే సబ్సిడీ కేవలం రూ.10వేలకు మించకపోవడం గమనార్హం. మిగిలిన పరికరాలు నాణ్యత లేని కంపెనీలకు చెందినవి కావడంతో పది రోజుల వ్యవధిలో అధికారులు హడావుడిగా నిధుల వినియోగానికి సన్నాహాలు చేసిన పెద్దగా ఫలితమివ్వలేదు.
వ్యవసాయ పనిముట్ల స్కీంకు..
మార్చి నెలాఖరులో నిధులు
సమయం లేక అమలు కాని తీరు
బడ్జెట్ కాలపరిమితి ముగిసి నిధులు లాప్స్
నిధులు లాప్స్ అయ్యాయి
కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో ఎస్‌ఎంఏఎం పథకానికి నిధులు మంజూరు చేయడంతో పది రోజుల్లో గత బడ్జెట్ కాలపరిమితి ముగిసి జిల్లాకు వచ్చిన రూ. 67 లక్షల నిధులు లాప్స్ అయ్యాయి. మళ్లీ ఈ బడ్జెట్‌లో నిధుల మంజూరుకు అనుమతి వస్తే రైతులకు అవగాహన కల్పించి పథకం అమలు చేస్తాం.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల


