చిక్కుల్లో బంగారం ముఠా | - | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో బంగారం ముఠా

Apr 4 2025 2:03 AM | Updated on Apr 4 2025 2:03 AM

చిక్కుల్లో బంగారం ముఠా

చిక్కుల్లో బంగారం ముఠా

● సౌదీ అరేబియా నుంచి రవాణా ● హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు దాటించాలని ఒప్పందం ● ఎయిర్‌పోర్టు దాటడంతోనే గేమ్‌చేంజ్‌ ● ఎత్తుకెళ్లిన మూడో వ్యక్తి ● వేములవాడలో కేసు నమోదు

చందుర్తి(వేములవాడ): సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తరలిస్తున్న ముఠా చిక్కుల్లో పడింది. బంగారం తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను కాదని వారి బంధువే దాన్ని ఎత్తుకెళ్లడంతో వీరిద్దరు ఇరకాటంలో పడ్డారు. సౌదీ అరేబియా నుంచి ఇండియాకు బంగారం పంపిన వ్యక్తి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో వేములవాడ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఐదు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి స్వగ్రామం జోగాపూర్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే బంగారం స్మగ్లర్లు వీరితో డీల్‌ కుదుర్చుకున్నారు. తీసుకొచ్చిన బంగారాన్ని హైదరాబాద్‌లో అప్పగించి.. తెచ్చినందుకు కమీషన్‌ తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

డామిట్‌ కథ అడ్డం తిరిగింది

జోగాపూర్‌కు చెందిన వ్యక్తి అదే మండలంలోని ఎన్గల్‌కు చెందిన తన బావమరిదిని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కారు తీసుకురావాలని సూచించాడు. ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత తన బావమరిదికి సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. ఇదే అదనుగా భావించిన ఎన్గల్‌కు చెందిన వ్యక్తి బంగారం అప్పగించకుండానే వారి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసి హైదరాబాద్‌లోనే తలదాచుకున్నారు. సౌదీ అరేబియాలో బంగారం అప్పగించిన వ్యక్తి తాను మోసపోయానని గ్రహించి రెండు రోజుల క్రితమే వేములవాడ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు జోగాపూర్‌కు చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఎక్కడున్న లొంగిపోవాలని, లేకుంటే అందరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. భయాందోళన చెందిన సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు చందుర్తి మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున వేములవాడ పోలీసుల ఎదుట సరెండర్‌ అయినట్లు తెలిసింది. కాగా బంగారం ఎత్తుకెళ్లిన ఎన్గల్‌కు చెందిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కాగా బంగారం తీసుకొచ్చిన వ్యక్తులు మాత్రం అది ఎంత బరువు ఉందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు ప్రచారం. ఇదే విషయమై వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ను వివరణ కోరితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. కానీ వివరాలు విచారణ ముగిసే వరకు బయటకు చెప్పబోమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement