జిన్‌పింగ్‌ మూడోస్సారి!

Xi Jinping Set To Secure Historic Third Term As China President - Sakshi

సెంట్రల్‌ కమిటీ సభ్యునిగా ఎన్నిక

ప్రధాని లీ తదితరులకు మొండిచేయి

నేడు అధ్యక్షునిగా ఎన్నిక లాంఛనమే

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (69) రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నేడు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. ఐదేళ్లకోసారి జరిగే వారం రోజుల కమ్యూనిస్టు పార్టీ సదస్సు శనివారం 205 మంది సెంట్రల్‌ కమిటీ సభ్యుల ఎన్నికతో ముగిసింది. ఆదివారం వీరంతా కలిసి 25 మంది పొలిటికల్‌ బ్యూరో సభ్యులను ఎన్నుకుంటారు.

తర్వాత వారు దేశ పాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు ఏడుగురు, లేదా అంతకంటే ఎక్కువ మందితో కీలకమైన స్టాండింగ్‌ కమిటీని ఎన్నుకుంటారు. వారిలోంచి ఒకరు ప్రధాన కార్యదర్శి పార్టీనీ, అధ్యక్ష హోదాలో దేశాన్నీ నడిపిస్తారు. జిన్‌పింగ్‌తో పాటు ఆయన మద్దతుదారులు చాలామంది సెంట్రల్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అధ్యక్షునిగా కొనసాగడం లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌అనంతరం పదేళ్లకు పైగా అధ్యక్ష పడవిలో కొనసాగనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక మావో మాదిరిగానే జీవితకాలం పదవిలో కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మావో అనంతరం చైనా అధ్యక్షులైన వారంతా పార్టీ నియమావళి ప్రకారం రెండుసార్లు పదవీకాలం పూర్తయ్యాక తప్పుకుంటూ వచ్చారు.

కమిటీలో కుదుపులు
పలువురు ప్రముఖులను ఇంటిదారి పట్టిస్తూ సెంట్రల్‌ కమిటీని భారీగా ప్రక్షాళించారు. జిన్‌పింగ్‌ తర్వాత నంబర్‌ టూగా కొనసాగుతున్న ప్రధాని లీ కీ కియాంగ్‌ (67), ఉప ప్రధాని హన్‌ జెంగ్‌ (68), నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ లీ జాన్షు (72), చైనీస్‌ పీపుల్స్‌ పొలికిటల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ వాంగ్‌ యాంగ్‌ (67) సహా పలువురు ప్రముఖులకు కమిటీలో చోటు దక్కకపోవడం విశేషం!

పైగా వీరంతా పదవీకాలం ముగుస్తున్న జిన్‌పింగ్‌ సారథ్యంలోని ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీలో సభ్యులు కూడా!! జిన్‌పింగ్‌కు మరిన్ని విశేషాధికారాలు కట్టబెడుతూ శనివారం సదస్సు తీర్మానాలను ఆమోదించింది. అనంతరం జిన్‌పింగ్‌ ప్రసంగించారు. ‘‘కష్టించేందుకు, గెలిచేందుకు భయపడొద్దు. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి’’ అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top