
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారయ్యింది. ఆయన ఈ నెల 31, వచ్చేనెల 1వ తేదీల్లో చైనాలో పర్యటిస్తారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. తియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో మోదీ పాల్గొంటారు. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల జవాన్ల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత ప్రధానమంత్రి చైనాలో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఆయన చివరిసారిగా 2018లో డ్రాగన్ దేశంలో పర్యటించారు. ఈసారి చైనా పర్యటన కంటే ముందు మోదీ ఈ నెల 30న జపాన్‌ను సందర్శించబోతున్నారు. ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు హాజరవుతారు. జపాన్‌ప్ర«దానమంత్రి ఫుమియో కిషిదాతో సమావేశమవుతారు. అక్కడి నుంచి చైనాకు చేరుకుంటారు. మోదీ పర్యటన కంటే ముందే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఎస్సీఓ సమావేశాల్లో పాల్గొంటారు.
అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాను సందర్శిస్తారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనైన సంగతి తెలిసిందే. సంబంధాల పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు దాదాపు చివరి దశకు వచ్చాయి. మోదీ పర్యటనతో స్నేహ సంబంధాలు మళ్లీ పూర్వస్థితికి చేరడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మోదీ చైనా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియాతోపాటు ‘బ్రిక్స్’ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేస్తున్నారు. ఇండియా ఉత్పత్తులపై ఇప్పటికే 25 శాతం టారిఫ్‌లు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే మరిన్ని తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనాపై కూడా ట్రంప్ సుంకాల మోత మోగించారు. చైనా ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం నిలిపివేయాలంటూ రష్యాపై ఒత్తిడి పెంచుతున్నారు. రష్యాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం, భారత ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్‌తోపాటు రష్యా ప్రతినిధి హాజరుకానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. షాంఘై సహకార సంస్థలో చైనా, ఇండియా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ ఏడాది ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఏడాది జూన్‌లో చైనాలోని ఖింగ్‌డావోలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి ప్రస్తావన ఇందులో లేకపోవడమే కారణం. దాంతో ఉమ్మడి ప్రకటన విడుదల చేయకుండానే సదస్సు ముగిసింది.