 
													దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ముఖాముఖి భేటీ
చైనా ఉత్పత్తులపై సుంకాలు 10 శాతం తగ్గిస్తాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతికి చైనా అంగీకారం
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానన్న ట్రంప్
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఆరేళ్ల తర్వాత ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ఇరువురు నేతలు గురువారం బుసాన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
చైనా ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించింది. మొత్తానికి అమెరికా, చైనాల మధ్య స్నేహ సంబంధాలకు ట్రంప్–జిన్‌పింగ్ భేటీ అద్దం పట్టింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని అమెరికాకు తిరిగివెళ్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. 
జిన్‌పింగ్‌తో ముఖాముఖి సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అన్నారు. మాదక ద్రవ్యాల(ఫెంటానిల్) తయారీకి అవసరమైన రసాయనాలు విక్రయిస్తున్నందుకు శిక్షగా చైనాపై ఈ ఏడాది మొదట్లో విధించిన 20 శాతం టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించబోతున్నట్లు తెలిపారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్‌లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోనున్నాయి. 
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్‌పింగ్ సైతం అమెరికాకు రాబోతున్నారని వెల్లడించారు. మరిన్ని అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై జిన్‌పింగ్‌తో చర్చించానని అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవన్నారు.
టిక్‌టాక్ సమస్యను పరిష్కరించుకుంటాం: చైనా  
ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో టిక్‌టాక్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. టిక్‌టాక్ యజమాన్యాన్ని చైనా నుంచి అమెరికాకు బదిలీ చేయాలని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అప్పగించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా యాజమాన్యంలో ఉంటే అమెరికాలోని యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీనికి చైనా అంగీకరించడం లేదు. అమెరికాతో నెలకొన్న టిక్‌టాక్ సమస్యను కచి్చతంగా పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తామని పేర్కొంది. మరోవైపు అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించేలా చైనాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచి్చంది.
అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు  
అమెరికా నుంచి ప్రతిఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ట్రంప్, జిన్‌పింగ్ చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్నారు. ఈరోజు నుంచి వచ్చే ఏడాది జనవరి దాకా చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయనుందని తెలిపారు. దీనివల్ల అమెరికా రైతులకు లబ్ధి చేకూరుతుందని బెసెంట్ వివరించారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
