‘ఏ దోస్త్‌ మేమున్నాం’.. పాకిస్థాన్‌కు జిన్‌పింగ్‌ భరోసా

Xi Jinping Assured Pakistan That We Will Not Let You Down - Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌ చింత తీర్చే హామీ ఇచ్చారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌. తమ చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌ను ఎప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనివ్వమని, అన్ని విధాలా ఆదుకుని గట్టెకిస్తామని భరోసా కల్పించారు. ఇప్పటికే 9 బిలియన్‌ డాలర్ల సాయం అందించిన డ్రాగన్‌.. మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత శనివారం మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌.. చైనా నుంచి 9 బిలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 4 బిలియన్‌ డాలర్లు రుణం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో చైనా అధ‍్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హామీలను గుర్తు చేసుకున్నారు. 

‘నవంబర్‌ 3న పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చైనా పర్యటనకు వెళ్లిన క్రమంలో షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి చింత వద్దు.. మేము మిమ్మల్ని సంక్షోభంలో కూరుకుపోనివ్వం అని ఆయన భరోసా కల్పించారు.’ అని వెల్లడించారు పాక్‌ ఆర్థిక మంత్రి. మరోవైపు.. దార్‌ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ను ప్రశ్నించగా.. ‘పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా అన్ని విధాల ఆదుకుంటుంది. ఇప్పటికే చాలా చేశాం.. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.’ అని తెలిపారు. 

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌.. అందులోంచి బయటపడేందుకు తన చిరకాల మిత్రులైన చైనా, సౌదీ అరేబియాకు మరింత దగ్గరవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అవసరమైన 35 బిలియన్‌ డాలర్లను సేకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు 13 బిలియన్‌ డాలర్లకుపైగా రుణాలు అందించేందుకు అంగీకరించాయి.

ఇదీ చదవండి: కేజీఎఫ్‌2 ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌ ట్విటర్‌ అకౌంట్‌ బ్లాక్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top