అత్యాచార ఘటన: సారీ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

Woman Alleges She Was Raped In Australian Parliament PM Apologises - Sakshi

కాన్‌బెర్రా: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమకు తామే సాటి అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. అయితే, వారిపట్ల వివక్ష, లైంగిక వేధింపులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇక పౌరుల హక్కులను కాపాడేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి తనపై సహోద్యోగి అత్యాచారం చేశాడని ఆరోపించించారు. 2019లో జరిగిన ఈ లైంగిక వేధింపుల ఘటనను ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

తనపై లైంగిక దాడి జరిగిన సమయంలో స్థానిక మీడియా, పోలీసులను సంప్రదించినప్పటికీ లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. పై అధికారుకు చెప్పినా వారు సరిగా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరూ తన గోడు పట్టించుకోలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన తాను భవిష్యత్‌పై భయంతో మిన్నకుండి పోవాల్సి వచ్చిందని తెలిపారు.

కాగా, ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న ఆస్టేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బాధిత మహిళకు క్షమాపణలు కోరారు. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాలలో మహిళలు ఎలాంటి వివక్ష ఎదుర్కోకూడదని అన్నారు. దాంతోపాటు ఆస్ట్రేలియాలో పనిప్రదేశాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా స్టేఫానీ ఫాస్టర్‌ అనే అధికారిని నియమించారు.

చదవండి: యూకేకు ప్రయాణం మరింత కఠినం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top