యూకేకు ప్రయాణం మరింత కఠినం

England hotel quarantine begins for arrivals from high-risk countries - Sakshi

హైరిస్క్‌ రెడ్‌ లిస్ట్‌లో 33 దేశాలు

భారత్‌కు మినహాయింపు

లండన్‌: కోవిడ్‌ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన తాజా ఆంక్షలతో హైరిస్క్‌ రెడ్‌ లిస్ట్‌లో ఉన్న 33 దేశాల నుంచి ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన యూకే, ఐర్లాండ్‌కు చెందిన ప్రయాణీకులు హోటల్‌లో క్వారంటైన్‌లో గడపాలి. ఈ జాబితాలో భారత్‌ లేదు. ఇంగ్లండ్‌కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్‌లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లు(రూ.1,76,581)ను ముందుగా చెల్లించాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. రెడ్‌ లిస్ట్‌లో లేని భారత్‌ వంటి దేశాలకు వెళ్లని యూకే, ఐర్లాండ్‌ నివాసితులు 10 రోజులపాటు తమ ఇళ్లలో క్వారంటైన్‌లో గడపాలి. ఇంగ్లండ్‌కు చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా టెస్ట్‌ చేయించుకోవాలి. ‘కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో తాజా చర్యలు తీసుకున్నాం. కొత్త వేరియంట్లను సరిహద్దులు దాటి లోపలికి రానివ్వరాదన్నదే మా లక్ష్యం’అని యూకే ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కోటిన్నర మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని వెల్లడించింది.

యూకే రెడ్‌లిస్ట్‌లో చేర్చిన 33 దేశాల్లో వివిధ కోవిడ్‌–19 వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హం.  ఇప్పటి వరకు యూకేలోకి ప్రవేశించిన ఏ ప్రాంతం వారైనా ప్రయాణానికి మూడు రోజులు ముందుగా చేయించుకున్న కోవిడ్‌–19 నెగెటివ్‌ పరీక్ష రిపోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అదేవిధంగా, రెడ్‌ లిస్ట్‌లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్‌ రెసిడెంట్లపై బ్రిటన్‌లో ప్రవేశించరాదనే నిబంధన కూడా ఉంది. యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలతో అత్యవసరం కాని ప్రయాణాలపై నిషేధం ఉంది. యూకే నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు.  

పోలీసులకు మరిన్ని అధికారాలు
తాజా నిబంధనల ప్రకారం సరిహద్దు భద్రతా బలగాలకు, పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, అనుమానిత ప్రయాణీకులను గుర్తించి మూడు గంటలపాటు నిర్బంధంలో ఉంచేందుకు వారికి అధికారాలిచ్చారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండే వారు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించారు. క్వారంటైన్‌ కోసం ప్రభుత్వం 4,963 గదులున్న 16 హోటళ్లను గుర్తించింది. మరో 58 వేల రూంలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణీకులు ఇంగ్లండ్‌కు చేరుకోవడానికి ముందుగానే తమ క్వారంటైన్‌ రూంలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్‌ ఏర్పాటైంది. హీత్రూ ఎయిర్‌పోర్టు, గాట్విక్, లండన్‌ సిటీ, బర్మింగ్‌హామ్, ఫార్న్‌బరోల్లో హోటళ్లను క్వారంటైన్‌ కోసం సిద్ధంగా ఉంచారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top