సీటీ స్కాన్‌లో బయటపడిన విషయం

Woman Accidentally Finds 2 Needles Embedded in Her Brain - Sakshi

బీజింగ్‌: ఓ మహిళ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టర్లు ఆమె తలకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టులో ఆమె మెదడులోకి రెండు పొడవైన సూదులు చొచ్చుకెళ్లినట్లు గుర్తించారు. చిత్రం ఏమిటంటే.. అవి తలలోకి ఎలా చొచ్చుకెళ్లాయో ఆమెకి కూడా తెలీదు. దానికి తోడు పుర్రెపై కూడా ఎలాంటి గాయాలు లేవు. దీంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. విచిత్రం ఏంటంటే దీని గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, ఎందుకైనా మంచిదని.. ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్‌ సమయంలో ఆమె తలలోకి వెళ్లినవి కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయని వైద్యులు గుర్తించారు. (చదవండి: లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!)

దీని గురించి వైద్యులు ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. ‘గతంలో ఎప్పుడైనా నీకు సర్జరీ జరిగిందా’ అని అడిగారు. ఇందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చింది. పోనీ.. తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పింది. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. తనకు ఏ రోజు తలకు సంబంధించిన సమస్యలు రాలేదని జుహు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. జుహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని, చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (వైర‌ల్‌: వందేళ్ల‌ కింద‌టి శ‌వం న‌వ్వుతోందా?)

అయితే, తాము యాత్రలకు వెళ్లినప్పుడు జుహును పిన్ని ఇంట్లో ఉంచామని, అప్పుడు ఆమె తమ బిడ్డ తలపై రెండు నల్లని గుర్తులు చూశానని తమతో చెప్పిందన్నారు. అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top