WHO-Covid 19 MU Variant: టీకాలకు లొంగని కోవిడ్‌ ఎంయూ వేరియంట్‌!

WHO warns new Mu variant of COVID-19 could be more vaccine resistant - Sakshi

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

39 దేశాల్లో కొత్త రకం కరోనా ఆనవాళ్లు  

WHO Warns On MU Variant Of Covid 19
జెనీవా: కోవిడ్‌–19 మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్‌ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది.

అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్‌కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్‌ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్‌తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్‌లో ఈ వేరియంట్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్‌లో వెల్లడించింది.
(చదవండి: న్యూయార్క్‌లో తుపాను బీభత్సం)

ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) వేరియంట్‌ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎంయూ వేరియంట్‌ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్‌లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ ఆగస్టు 30న వాచ్‌లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్‌ తరహాలోనే ఎంయూ వేరియంట్‌ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
(చదవండి: కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్‌ఆర్టీసీ..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top