వ్యాక్సిన్‌ పంపిణీ.. డబ్ల్యూహెచ్‌ఓ స్పందన | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది మధ్య వరకు వ్యాక్సిన్‌ పంపిణీ కుదరదు

Published Fri, Sep 4 2020 5:15 PM

WHO On Vaccine Distribution Not Expected Until Mid 2021 - Sakshi

జెనీవా: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ని‌ అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. అందరి కంటే ముందు తామే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ని ప్రకటించగా.. అమెరికా ఈ ఏడాది నవంబర్‌ 1 నాటికి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది మధ్య వరకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వివిద దశల్లో ఉన్న వ్యాక్సిన్‌లేవి తాము సూచించిన ప్రమాణాల్లో కనీసం 50 శాతం కూడా సాధించలేదని తెలిపారు. ఈ సం‍దర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది మధ్య వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని మేం భావించడం లేదు’ అన్నారు. (చదవండి: నవంబర్‌ 1నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ)

అంతేకాక ‘వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మూడవ దశ హ్యూమన్‌ ట్రయల్స్‌కు చాలా సమయం పడుతుంది. ఈ దశలో వేల మంది మీద వ్యాక్సిన్‌ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని రియాక్షన్‌ ఏంటో చూడాలి. సదరు వ్యాక్సిన్‌ సురక్షితమా కాదా తేల్చాలి. ఇదంతా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వచ్చే ఏడాది మధ్య వరకు వ్యాక్సిన్‌ పంపిణీ కుదరదు’ అన్నారు. అంతేకాక ప్రయోగాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఇతర వాటితో పోల్చి చూడాలి అన్నారు. ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వాటి ఫలితాలు ఇంకా తెలియలేదు. సదరు వ్యాక్సిన్‌లు సురక్షితమో కాదో తేలాల్సి ఉంది అన్నారు హారిస్‌. (చదవండి: ‘రష్యా టీకా అడ్వాన్స్‌ స్టేజ్‌లో లేదు’)

డబ్ల్యూహెచ్‌ఓ, గవి(జీఏవీఐ) కూటమి కోవ్యాక్స్‌ అని పిలువబడే ప్రపంచ వ్యాక్సిన్ కేటాయింపు ప్రణాళికకు నాయకత్వం వహిస్తోంది. ఇది వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడానికి, పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. ఈ కూటమి ప్రతి దేశంలో అత్యంత డేంజర్‌ జోన్‌లో ఉన్న హెల్త్‌కేర్ వర్కర్స్‌కి మొదట వ్యాక్సిన్‌ అందజేయడంపై దృష్టి పెడుతుంది. కోవాక్స్ 2021 చివరి నాటికి 2 బిలియన్ మోతాదుల ఆమోదించిన వ్యాక్సిన్లను సేకరించి పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, అయితే అమెరికాతో సహ పలు దేశాలు దీనిలో చేరలేదు.
 

Advertisement
Advertisement