
గతంలో తప్పుచేశారని గ్రీన్‌కార్డ్, వీసాదారులను సైతం
బహిష్కరించేందుకు ట్రంప్ యత్నం
ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందిన సంబంధిత బిల్లు
ఎగువసభలోనూ ఆమోదం పొందితే చట్టంగా మారే ప్రమాదం
భారతీయులకు ఎదురవుతున్న కొత్త సమస్య
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్‌కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది.
ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్‌ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టారు. జూన్‌లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్‌లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి.
ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్‌కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్‌కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత నిర్దయగా నిబంధనలు
కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్‌కార్డ్‌దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు.
నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్‌హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది.