శ్రుతి మించుతున్న ట్రంప్‌... వెనెజువెలాపై యుద్ధం!  | US sending F-35 fighter jets to Puerto Rico to target drug cartels | Sakshi
Sakshi News home page

శ్రుతి మించుతున్న ట్రంప్‌... వెనెజువెలాపై యుద్ధం! 

Sep 8 2025 4:51 AM | Updated on Sep 8 2025 4:51 AM

 US sending F-35 fighter jets to Puerto Rico to target drug cartels

నావికా, వాయు దళాలతో అష్టదిగ్బంధం 

ఏ క్షణమైనా వెనెజువెలాపై దాడి! 

అక్కడి చమురు నిక్షేపాలే లక్ష్యం

వాషింగ్టన్‌: ఆసియా, యూరప్‌ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్‌ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్‌ ట్రంప్‌  శరవేగంగా పావులు కదుపుతున్నారు. 

అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్‌ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్‌–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్‌ ఈ  ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు 
మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్‌ఎస్‌ గ్రేవ్‌లీ, యూఎస్‌ఎస్‌ జాసన్‌ డన్‌హమ్‌ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్‌ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్‌ మిసైల్స్‌ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్‌ నౌక యూఎస్‌ఎస్‌ సామ్సన్‌ వాటికి తోడైంది. 

ఇవి చాలవన్నట్టు పసిఫిక్‌ మహా సముద్రం నుంచి యూఎస్‌ఎస్‌ లేక్‌ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్‌ఎస్‌ ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ సాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడెర్డేల్‌ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్‌ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్‌–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!

వెనెజువెలా ‘తగ్గేదే లే’! 
సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్‌ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్‌ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్‌–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! 

చమురు నిక్షేపాలపై కన్ను 
పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్‌ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్‌ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement