కాల్పుల విర‌మ‌ణ‌పై ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌! | US President Donald Trump extends Iran ceasefire After Request From Pakistan | Sakshi
Sakshi News home page

కాల్పుల విర‌మ‌ణ‌పై ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Apr 22 2026 4:12 AM | Updated on Apr 22 2026 4:56 AM

US President Donald Trump extends Iran ceasefire After Request From Pakistan

ఇరాన్‌, అమెరికా మ‌ధ్య రెండో విడ‌త శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధ‌త కొన‌సాగుతున్న వేళ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పాకిస్తాన్ అభ్య‌ర్థ‌న మేర‌కు కాల్పుల విర‌మ‌ణను మ‌రోసారి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్రంప్ త‌న సామాజిక మాధ్య‌మం ట్రూత్ వేదిక‌గా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధ‌నం మాత్రం కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

ఇరాన్ త‌మ‌తో ఏకీకృత ఒప్పందానికి వ‌చ్చే వ‌ర‌కు, శాంతి చ‌ర్చ‌లు ముగిసేవ‌ర‌కు కాల్పుల విమ‌ర‌ణ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్ష‌ల్ ఆసిమ్ మునీర్‌, ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్‌ల నుంచి ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తులు రావ‌డంతో కాల్పుల విర‌మ‌ణ పొడిగింపుపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్ష‌ల్ ఆసిమ్ మునీర్‌, ప్ర‌ధానమంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌ల అభ్య‌ర్థ‌న మేర‌కు ఇరాన్ ఏకీకృత ప్ర‌తిపాద‌న‌తో ముందుకు వ‌చ్చే వ‌ర‌కు, చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కు కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధ‌నం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్ప‌టికే దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. 

అయితే ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండో విడ‌త శాంతి చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేందుకు ఇరాన్ విముఖ‌త చూప‌డంతో ట్రంప్ మంగళవారం  సీఎన్‌బీసీ ‘స్వాక్‌బాక్స్‌’ కార్య‌క్ర‌మంలో ఇరాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావ‌డం త‌ప్ప వారికి మ‌రో మార్గం లేదు. ఒక‌వేళ శాంతి ఒప్పందం కుద‌ర‌క‌పోతే ఇరాన్‌పై బాంబులేయ‌డ‌మే అత్యుత్త‌మ మార్గం.కాల్పుల విర‌మ‌ణ గడువు పొడిగించే ప్ర‌స‌క్తే లేదు. గ‌డువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండ‌దు’ అని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. 

బుధవారంతో ఇరాన్‌, అమెరికాల మధ్య కాల్పుల విర‌మ‌ణ గడువు ముగియనుంది. అయితే ఇంత‌లో ట్రంప్ కాల్పుల విర‌మ‌ణ‌పై యూట‌ర్న్ తీసుకోవ‌డంతో కొంతమేర ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ల‌యింది.

ఫలించిన పాక్ ప్రయత్నం..
హార్మూజ్‌ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్‌ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.  

ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement