అంత్యక్రియల ముసుగులో అవయవాల విక్రయం.. తల్లీకూతుళ్ల చీకటి కోణం

US Funeral Home Owner Sentenced 20 Years For Selling Body Parts - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్‌ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్‌ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్‌ పత్రాల సాయంతో ‘మేగన్‌ హెస్‌’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది.  

ఇదీ జరిగింది..
కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో ‘సన్‌సెట్‌ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్‌ హెస్‌. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్‌ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 

2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్‌ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్‌ హెస్‌, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)కి రాయిటర్స్‌ సమాచారం అందించడంతో వారి బిజినెస్‌ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. 

ఇరువురిని అరెస్ట్‌ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్‌ హెస్‌కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్‌ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్‌కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది.  

మరోవైపు.. హెస్‌ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. 

ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్‌: మహిళా కోచ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top