బైడెన్‌ అసమర్థ పాలనలో... అమెరికా సర్వభ్రష్టం

US ex-president Donald Trump charged over pre-election hush-money cases - Sakshi

దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు: ట్రంప్‌

బైడెన్‌ హయాంలో అణ్వాయుధ మూడో ప్రపంచ యుద్ధం

విచారణ అనంతరం తొలి ప్రసంగంలో ట్రంప్‌ నిప్పులు

తాను పూర్తిగా అమాయకుడినని పునరుద్ఘాటన

అటార్నీ, సుప్రీంకోర్టు జడ్జిపైనా తీవ్ర విమర్శలు

వాషింగ్టన్‌: హష్‌ మనీ చెల్లింపుల కేసులో తాను పూర్తిగా అమాయకుడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనపై దాఖలైన క్రిమినల్‌ అభియోగాలకు సంబంధించి మంగళవారం ఆయన న్యూయార్క్‌లో మన్‌హాటన్‌ జ్యూరీ ముందు విచారణకు హాజరవడం తెలిసిందే. అనంతరం ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు.

ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. వామపక్ష అతివాద ఉన్మాదులు దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకెళ్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మద్దతుదారులపై నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడిలా ఎన్నికల ప్రక్రియనూ ముందుగానే ప్రభావితం చేయజూస్తున్నారని ఆరోపించారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హెచ్చరించారు. ‘‘బైడెన్‌ దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు.

ఆయనకు ముందున్న ఐదుగురు అత్యంత అసమర్థ అధ్యక్షుల వైఫల్యాన్నింటినీ కలగలిపినా బైడెన్‌ పాలనా వైఫల్యాల్లో పదో వంతుకు కూడా తూగవు. అంతటి దారుణ పాలనతో అమెరికాను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తూ విఫల రాజ్యంగా మారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. డాలర్‌ శరవేగంగా పతనమవుతోంది. గత 200 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత దారుణ పరాజయమిది! ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ఇంకెంత మాత్రమూ సూపర్‌ పవర్‌ కాదు. సర్వనాశనం దిశగా పయనిస్తోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.

నేనుంటేనా...!
బైడెన్‌ అసమర్థత వల్ల నమ్మశక్యం కాని రీతిలో చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా చేతులు కలిపాయని ట్రంప్‌ ఆరోపించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి అత్యంత వినాశకర సంకీర్ణంగా రూపొందాయి. ఎన్నో దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్తిస్థాయి అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. బైడెన్‌ హయాంలోనే జరిగి తీరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేనుంటే వీటిలో దేన్నీ జరగనిచ్చేవాన్ని కాదు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధమే జరిగేది కాదు. ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదు. అందమైన ఉక్రెయిన్‌ పట్టణాలు నేలమట్టమయ్యేవి కాదు’’ అని ట్రంప్‌ అన్నారు.

అదే నా తప్పిదం...
వినాశక శక్తుల బారినుంచి దేశాన్ని సాహసోపేతంగా కాపాడటమే తాను చేసిన ఏకైక తప్పిదమంటూ బైడెన్, ఆయన మద్దతుదారులపై ట్రంప్‌ నిప్పులు చెరిగారు. తనపై కేసు విషయంలో మన్‌హాటన్‌ జిల్లా అటార్నీ ఆల్విన్‌ బ్రాగ్‌తో పాటు దాన్ని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జువాన్‌ ఎం.మెర్చన్‌పైనా విరుచుకుపడ్డారు. వారిద్దరూ డెమొక్రటిక్‌ పార్టీ సానుభూతిపరులంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అంతేకాదు, వారిద్దరికీ నేనంటే విపరీతమైన ద్వేషం. జువాన్‌ భార్యకు, కుటుంబానికీ నేనంటే అసహ్యమే. ఆయన కూతురు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కోసం పని చేస్తోంది’’ అన్నారు. ఎవరేం చేసినా తనను కుంగదీయలేరని, అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చి చూపిస్తానని చెప్పుకొచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top