గంటకు 160 కి.మీ వేగంతో ప్రచండ తుపాను గాలులు..  సరదాగా ఎదురెళ్తారా?

Universe Science Park In Denmark Launched Storm Simulator - Sakshi

తుపానుల సమయంలో వీచే పెను గాలుల హోరు ఏ స్థాయిలో ఉంటుందో మనం అప్పుడప్పుడూ టీవీల్లో చూసే ఉంటాం.. కానీ గంటకు సుమారు 160 కి.మీ. వేగంతో వీచే ప్రచండ గాలుల తీవ్రతను ఎప్పుడైనా అనుభూతి చెందారా? డెన్మార్క్‌లోని యూనివర్స్‌ సైన్స్‌ పార్క్‌ ఔత్సాహికులకు ఈ వెరైటీ అవకాశాన్ని కల్పిస్తోంది! అది కూడా పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే!! ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? 

కృత్రిమంగా ప్రచండ గాలులను సృష్టించడం ద్వారానేలెండి. ఇందుకోసం సైన్స్‌ పార్క్‌లో తాజాగా రెండు సిములేటర్లతో కూడిన గ్లాస్‌ చాంబర్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసి కృత్రిమంగా పెను గాలులను సృష్టిస్తున్నారు. బీట్‌ ద స్టార్మ్‌గా పిలిచే ఈ చాంబర్‌లోకి ఐదేళ్ల చిన్నారులు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకు వెళ్లి భారీ గాలులను అనుభూతి చెందొచ్చు.

అయితే పిల్లల కోసం 35 కి.మీ. వేగంతో వీచే సాధారణ గాలులను సిములేటర్‌ల ద్వారా సృష్టిస్తుండగా పెద్దల కోసం 160 కి.మీ. వేగం వరకు కేటగిరీ–2 హరికేన్‌ గాలులను సృష్టిస్తున్నారు. గాలులు ఇక చాలనుకుంటే ఔత్సాహికులు గ్లాస్‌ చాంబర్‌లో ఒకవైపు నుంచి మరోవైపునకు గాలికి ఎదురెళ్లి అక్కడున్న బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top