
బుచా మారణ హోమంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు.
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ ముగిసేది.. పోరాట తీవ్రతను బట్టే ఉంటుందని మంగళవారం సాయంత్రం ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై, పాశ్చాత్య దేశాల ఆరోపణలపై పుతిన్ ఈ రేంజ్‌లో బహిరంగంగా స్పందించడం విశేషం. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యసాధనలో నష్టం స్వల్పంగా ఉండాలనే రష్యా కోరుకుందని ఆయన అన్నారు. అయితే పరిస్థితులు అందుకు విఘాతం కలిగించాయని పుతిన్ చెప్పుకొచ్చారు. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు బెడిసి కొట్టాయని, రష్యా తట్టుకుని నిలబడగలిగిందని, పైగా అది వాళ్లకు ఎదురుదెబ్బగా పరిణమించిందని పుతిన్ అభివర్ణించారు.
రష్యా, బెలారస్‌ల ఆంక్షలతో మరింత ఇరకాటం పెట్టే ప్రయత్నాలు చేశారని, ఇలాంటి సమయంలో ఇరు దేశాల సమగ్రతను పెంచడం చాలా ముఖ్యమని పుతిన్ అభిప్రాయపడ్డారు.
ఇక బుచా మారణహోమాన్ని.. ఫేక్‌గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్,ఉక్రెయిన్ గడ్డపై రష్యా బలగాలు నరమేధానికి పాల్పడిందని ఆరోపణలు తోసిపుచ్చారు. డిమాండ్‌ల విషయంలో ఉక్రెయిన్ అస్థిరత్వం వల్లే శాంతి చర్చల పురోగతి మందగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు దాడికి కట్టుబడి ఉన్నందున మాస్కో తన సైనిక దూకుడును కొనసాగిస్తుందని చెప్పారు. ఉత్తమ యుద్ధ లక్ష్యాలన్నింటిలో విజయం సాధిస్తుందని పుతిన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.