Russia Ukraine War: ఓవైపు కాల్పుల మోత.. వణికించే చలిలో వలసలు

Ukraine On The Brink Of Crisis As Russia Intensifies Attacks - Sakshi

కీవ్‌: యుద్ధంతో కుంగిపోతున్న ఉక్రెయిన్‌లో ఓవైపు భారీగా రష్యా కాల్పుల మోత, మరోవైపు పెద్ద సంఖ్యలో పౌరుల తరలింపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా పొట్ట చేతపట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లారు. వీరిలో సగానికి సగం చిన్నారులేనని సమాచారం. వలస వెళ్లిన వారిలో చాలామంది పోలండ్‌ బాట పట్టారు.

సమీలో బుధవారం ప్రకటించిన 12 గంటల కాల్పుల విరమణ సమయంలో మానవీయ కారిడార్ల గుండా గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు నగరం వదిలి వెళ్లినట్టు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. మంగళవారం 1700 మంది భారతీయ, ఇతర దేశాల స్టూడెంట్లతో పాటు దాదాపు 5000 మంది నగరం వీడినట్టు సమాచారం. ఇతర నగరాల్లో మాత్రం రష్యా కాల్పులు, ఆ దేశానికి దారితీసే కారిడార్లను ఉక్రెయిన్‌ అంగీకరించపోవడంతో తరలింపులు సాధ్యపడలేదు. మారియుపోల్‌లో నిత్యావసరాలతో వస్తున్న ఉక్రెయిన్‌ హ్యుమానిటేరియన్‌ వాహనాలపై రష్యా సేనలు కాల్పులకు దిగడంతో అక్కడ కూడా తరలింపుకు విఘాతం కలిగినట్టు సమాచారం.

బెలారస్‌ రాజధాని మిన్స్‌క్‌ ఎయిర్‌ బేస్‌లో రష్యా భారీ సంఖ్యలో హెలికాప్టర్లను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇవన్నీ ఉక్రెయిన్‌పై మరింత భారీ దాడి వ్యూహంలో భాగం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా అల్లాడుతోంది. పరిస్థితి చేజారుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల నుంచి డాలర్స్‌ విత్‌డ్రాయల్స్‌పై రష్యా సెంట్రల్‌ బ్యాంకు పరిమితి విధించింది.

ఇవన్నీ జనాల్లో భయాందోళనలను మరింతగా పెంచుతున్నాయి. దాంతో వీలైనంత వరకూ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. దాంతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. 

భీకర దాడులు 
పట్టణాలు, నగరాలను లక్ష్యం చేసుకుని రష్యా చేస్తున్న దాడులు బుధవారం మరింత పదునెక్కాయి. భారీగా వచ్చిపడుతున్న బాంబులు, క్షిపణులతో రాజధాని కీవ్, ఖర్కీవ్, మారియుపోల్, మల్యిన్, చుహుయివ్, ఒడెసా, చెర్నిహివ్, మైకోలెవ్‌ అల్లాడుతున్నాయి. ఖర్కీవ్, జైటోమిర్, మాలిన్‌ నగరాల్లోనైతే నివాస ప్రాంతాలపై రష్యా విమానాలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి. వీటిలోనూ భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు.

కీవ్‌ శివార్లలోని ఇర్పిన్, బుచా, హోస్టోమెల్, వ్యషోరోడ్, బోరోడియాంక తదితర చోట్ల పరిస్థితి దయనీయంగా ఉందని సమాచారం. తిండి, తాగునీరు, కరెంటు, మందులు తదితరాల కొరతతో ఎక్కడ చూసినా జనం అష్టకష్టాలు పడుతున్నారు. విపరీతమైన చలి పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. మారియుపోల్‌ తదితర నగరాల్లో ఏ వీధిలో చూసినా దిక్కూమొక్కూ లేకుండా పడున్న శవాలే కన్పిస్తున్నాయి.

వీలైనప్పుడల్లా పెద్ద సంఖ్యలో శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. బాంబుల మోత ఏ కొంచెంసేపు ఆగినా నిత్యావసరాల కోసం దుకాణాలపై జనం దాడులకు దిగుతున్నారు. కనిపించిన సరుకులనల్లా ఖాళీ చేస్తున్నారు. ఇది పోట్లాటలకూ దారితీస్తోంది. రాజధాని కీవ్‌లో జనం చాలావరకు సబ్‌వే స్టేషన్లలోనే తలదాచుకుంటూ గడుపుతున్నారు. నగరంపై రష్యా భీకరంగా దాడులను కొనసాగిస్తోంది. నగరంలోని మానసిక చికిత్సాలయంలో 200 మందికి పైగా రోగులు నిస్సహాయంగా పడి ఉన్నారు. బుధవారం నాటి కాల్పుల్లో పౌరులు భారీగా మరణించినట్టు ఉక్రెయిన్‌ చెప్తోంది. 

రష్యా సైనికులూ, వెళ్లిపోండి: జెలెన్‌స్కీ 
రష్యా సైనికులు ఇప్పటికైనా యుద్ధం ఆపి వెనుదిరగాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ‘‘మా పోరాట పటిమను రెండు వారాలుగా చూస్తున్నారుగా. మేం లొంగే ప్రసక్తే లేదు. మా భూభాగమంతటినీ తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం. వెళ్లిపోయారంటే ప్రాణాలు దక్కించుకున్న వాళ్లవుతారు’’ అని రష్యన్‌ భాషలో వారికి సూచించారు.

కీవ్, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తమకు వెంటనే యుద్ధ విమానాలు పంపాల్సిందిగా పశ్చిమ దేశాలను మరోసారి కోరారు. జెలెన్‌స్కీ పిలుపునకు పోలండ్‌ స్పందించింది. ఉక్రెయిన్‌కు మిగ్‌ ఫైటర్‌ జెట్లను పంపేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని మాటెజ్‌ మొరావికి ప్రకటించారు.

ఆస్పత్రి పై బాంబుల వర్షం 
మారియుపోల్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా సైన్యాలు బాంబుల వర్షం కురిపించాయి. దాడిలో ఆస్పత్రి దాదాపుగా నేలమట్టమైందని సిటీ కౌన్సిల్‌ చెప్పింది. ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమంది. దీన్ని దారుణమైన అకృత్యంగా జెలెన్‌స్కీ అభివర్ణించారు. పసిపిల్లలతో పాటు చాలామంది శిథిలాల కింద చిక్కుబడ్డారని ఆవేదన వెలిబుచ్చారు. దాడిలో ఆస్పత్రి శిథిలాల దిబ్బగా మారిన వైనానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్‌ చేశారు.   

రష్యా సైనికుల అవస్థలు 
ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా రష్యా సైనికులను చంపేసినట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది. వందలాది యుద్ధ ట్యాంకులు, 1,000కి పైగా సాయుధ వాహనాలు, 50 దాకా యుద్ధ విమానాలు, సుమారు 100 హెలికాప్టర్లు తదితరాలను ధ్వంసం చేశామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. తమ పౌరులను భారీ సంఖ్యలో రష్యా సేనలు పొట్టన పెట్టుకున్నాయని ఆరోపించింది. రష్యా ఖండిస్తున్నా, ఈ రెండు వారాల్లో దాని సైన్యానికి ఇప్పటిదాకా భారీ నష్టమే జరిగిందని తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలున్ని గద్దెనెక్కించాలన్న లక్ష్యానికి ఇప్పటికీ రష్యా ఇంకా చాలా దూరంలోనే ఉంది. పైగా కీవ్‌ దేవుడెరుగు, ఖెర్సన్‌ మినహా ఏ ప్రధాన నగరమూ ఇప్పటిదాకా రష్యా అధీనంలోకి రాలేదు. ఉక్రెయిన్‌ చెబుతున్న స్థాయిలో కాకున్నా రష్యాకు సైనిక నష్టం వేలల్లోనే జరిగి ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్‌ సైనికులు తమ పౌరులతోకలిసి రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. దాంతో ముందుకు సాగడం వారికి చాలా కష్టంగా మారుతోంది.

ఉక్రెయిన్‌ నుంచి ఈ స్థాయి ప్రతిఘటనను పుతిన్‌ అంచనా వేయలేకపోయారంటున్నారు. పైగా సైన్యానికి ఆహారం, ఇంధన తదితర సరఫరాలు సరిగా అందడం లేదని తెలుస్తోంది. దీనికి వణికించే చలి తోడై వారి పరిస్థితి దుర్భరంగా ఉందంటున్నారు. అనుకున్నంత త్వరగా లక్ష్యం సాధించలేకపోయానన్న నిరాశలో ఉక్రెయిన్‌పై దాడులను పుతిన్‌ మరింత తీవ్రతరం చేయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రష్యా సైనికులు యుద్ధం చేయడానికి అంత సుముఖంగా లేరన్న సంకేతాలు ఆ దేశ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నాయి

(చదవండి: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top