యూకే ఆరోగ్య మంత్రి రాజీనామా  | UK Health Minister Wes Streeting resigns as Health Secretary | Sakshi
Sakshi News home page

యూకే ఆరోగ్య మంత్రి రాజీనామా 

May 15 2026 1:19 AM | Updated on May 15 2026 1:19 AM

UK Health Minister Wes Streeting resigns as Health Secretary

ప్రధాని స్టార్మర్‌కు మరో ఎదురుదెబ్బ

లండన్‌: యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌పై మంత్రుల తిరుగుబాటు కొనసాగుతోంది. ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పలువురు ఉప మంత్రులు వైదొలిగారు. తాజాగా, ఆయన కేబినెట్‌లోని ఆరోగ్య మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ రాజీనామా చేశారు. స్టార్మర్‌పై తిరుగుబాటు ప్రకటించిన మొదటి సీనియర్‌ మంత్రి స్ట్రీటింగ్‌ కావడం గమనార్హం. ‘ప్రపంచ వేదికపై మీరు ధైర్యాన్ని, రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. 

ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధంలో బ్రిటన్‌ పాల్గొనకుండా చేయడంలో మీ పాత్ర కీలకం. కానీ, మనకు ఒక స్పష్టమైన దూరదృష్టి, సరైన దిశానిర్దేశం లేకుండాపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు లేబర్‌ పార్టీని నడిపించలేరనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. అందుకే వైదొలుగుతున్నాను’అని రాజీనామా లేఖలో స్ట్రీటింగ్‌ పేర్కొన్నారు. ప్రధాని పీఠంపై ఎప్పటినుంచో కన్నేసిన వెస్‌ స్ట్రీటింగ్‌.. స్టార్మర్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. 

అదేవిధంగా, మాజీ ఉపప్రధాని అంజెలా రేనార్‌ కూడా ప్రధాని రేసులో ఉంటానని ప్రకటించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై రాజీనామా చేసిన అంజెలా అభియోగాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ప్రధాని పదవి కోసం అవసరమైతే స్ట్రీటింగ్‌తోనూ పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. వీరిద్దరితోపాటు గ్రేటర్‌ మాంచెస్టర్‌ మేయర్‌ ఆండీ బర్న్‌హమ్‌ కూడా స్టార్మర్‌కు గట్టి పోటీదారుగా మారే అవకాశాలున్నాయంటున్నారు. 

అయితే, ఆయన ముందుగా పార్లమెంట్‌కు ఎన్నికవ్వాల్సి ఉంది. అందుకుగాను ఒక సభ్యుడు రాజీనామా చేస్తే ప్రత్యేకంగా ఎన్నిక జరిపి ఆండీని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. గత వారం స్థానిక ఎన్నికలకు జరిగిన అధికార లేబర్‌ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించినప్పటి నుంచి ప్రధాని స్టార్మర్‌పై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. అయితే, వైదొలిగేది లేదంటూ గురువారం ఆయన మరోసారి ప్రకటించడం గమనార్హం. 

లేబర్‌ పార్టీ నిబంధనల ప్రకారం..ప్ర«దానమంత్రికి ప్రధాన పోటీ దారుగా నిలవాలనుకునే నేత కామన్స్‌ సభలోని 403 మందికిగాను కనీసం 81 మంది మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. గతంలో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉండగా, ప్రధానిని గద్దె దించిన సందర్భాలున్నప్పటికీ, లేబర్‌ పార్టీ అటువంటి పరిస్థితి రావడం చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌లో రికార్డు స్థాయిలో 400కు పైగా ఎంపీలను గెల్చుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే స్టార్మర్‌ పదవి కోల్పోవాల్సి వస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement