
రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం
రష్యా, జపాన్, అమెరికా, హవాయ్ తీరాలను తాకిన భీకర సునామీ అలలు
రష్యా తూర్పు తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపనలు
తీరపట్టణాలను కుదిపేసిన అత్యంత ఎత్తైన అలలు
చివురుటాకులా వణికిన తీరదేశాల ప్రజలు
టోక్యో/మాస్కో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా సమీప పసిఫిక్ మహాసముద్రగర్భంలో జనించిన ప్రళయ భీకర సునామీ రెప్పపాటులో ఆ సముద్ర తీర దేశాలను చివురుటాకులా వణికించింది. సముద్రగర్భ భూకంపం ధాటికి ఉద్భవించిన రాకాసి అలలు క్రూరంగా తీరపట్టణాలపై విరుచుకుపడ్డాయి. రిక్టర్‌స్కేల్‌పై 8.8 తీవ్రతతో మొదలైన భూ ప్రకంపనలు తీర దేశాల్లోని కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి.
భవనాలు పేకమేడల్లా కూలుతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీరప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృతస్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాలపాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాల్లోకి సముద్రపునీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. రష్యా తూర్పున సుదూరంగా ఉన్న కామ్‌చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్సక్–కామ్చాట్‌స్కీ నగర సమీపంలో ఈ భూకంపం సంభవించింది.
స్థానిక కాలమానం ప్రకారం రష్యాలో బుధవారం ఉదయం 11.24 గంటలకు పసిఫిక్ మహాసముద్రగర్భంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. కామ్‌చట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా 20 అడుగుల ఎత్తులో దూసుకొచ్చి తీరంలో పెను విలయం సృష్టించాయని రష్యా సోషనాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. సివిరో కురిల్సŠక్ తీరపట్టణంపై 14 అడుగుల ఎత్తైన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి.
తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్‌లకు దూరంగా ఉన్న పచ్చికబయళ్లకు పరుగులు తీశారు.
ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటకు దూకి గాయాలపాలయ్యారు. అమెరికాలోని హోనలూనూ సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. ద్వీప రాష్ట్రం హవాయీలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు.

భూ ప్రకంపనలు జపాన్ తీరాలను తాకినా ఆ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ స్పష్టంచేసింది. సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీబుధవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం గమనార్హం. సునామీ తర్వాత పలు దేశాల బీచ్‌లు నిర్మానుష్యంగా మారాయి.
1900 ఏడాది నుంచి సంభవించిన భారీ భూకంపాలు
→ 1960 చిలీ దేశంలోని బియబియో (రిక్టర్ స్కేల్‌పై 9.5 తీవ్రత)
→ 1964 అమెరికాలోని అలాస్కా(రిక్టర్ స్కేల్‌పై 9.2 తీవ్రత)
→ 2011 జపాన్‌లోని తొహోకూ (రిక్టర్ స్కేల్‌పై 9.1 తీవ్రత)
→ 2004 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్‌పై 9.1 తీవ్రత)
→ 1952 రష్యాలోని కామ్‌చట్కా (రిక్టర్ స్కేల్‌పై 9 తీవ్రత)
→ 2025 రష్యాలోని కామ్‌చట్కా (రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత)
→ 2010 చిలీలోని బియోబియో (రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత)
→ 1906 ఈక్వెడార్‌లోని ఎస్మిరాల్డాస్ (రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత)
→ 1965 అమెరికాలోని అలాస్కా (రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రత)
→ 2012 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్‌పై 8.6 తీవ్రత)
బద్దలైన అగ్నిపర్వతం
భూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్‌చట్కా పరిధిలోని కిచెవ్‌స్కయా సోప్రా అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తరార్థ గోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజిమ్మింది. పలు పేలుళ్లు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని జియోఫిజికల్ విభాగం ప్రకటించింది. పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్రస్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీచేసి తర్వాత పెనుప్రమాదం లేదని తెలిశాక ఉపసంహరించుకున్నాయి.
అయినా సర్జరీ ఆగలేదు...
రష్యాలోని కామ్‌చట్కా ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడే అక్కడి ఒక ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్స జరుగుతోంది. కాళ్ల కింద నేల కదులుతున్నా వైద్యులు ఏమాత్రం జంకకుండా జాగ్రత్తగా సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. సంబంధింత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆపరేషన్ థియేటర్‌లోని రోగి పడుకున్న స్ట్రెచర్‌ను సహాయక సిబ్బంది గట్టిగా పట్టుకోవడం, వైద్యులు సర్జరీని కొనసాగించడం ఆ వీడియోలో రికార్డయింది. దీంతో ఆపత్కాలంలోనూ వైద్యులు చూపిన వృత్తి నిబద్ధతను మెచ్చుకుంటూ పలువురు సామాజికమాధ్యమాల్లో కామెంట్లు పెట్టారు.