
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ గతంలో వ్యాఖ్యానించింది తెలిసిందే. తాజాగా.. భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడ్డారు.
వైట్‌హౌజ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లలతో ఆగమాగమవుతోంది. అదొక విశాలమైన దేశం. అపారమైన సామర్థ్యమూ ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. ఈ సమయంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారాయన..
‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి.. 'మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం' అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బనే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఎకానమీ వ్యాఖ్యలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి..
ఇదిలా ఉంటే.. భారత్ అమెరికాకు మిత్రదేశమేనని, వాణిజ్యం మాత్రం సక్రమంగా లేదని చెబుతూ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. ఆ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కోనుగోళ్ల నేపథ్యంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఇరు దేశాల తమ డెడ్ ఎకానమీలను మరింత దిగజారచుకుంటున్నాయని.. ఆ అంశాన్ని అమెరికా పట్టించుకునే స్థితిలో లేవని అన్నారు. అటుపై భారత్‌పై మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించడంతో ఆ సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయంగా పేర్కొంది. అదే సమయంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.
మరో పక్క.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తానే ఆపుతానంటూ చెబుతూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కానున్నారు. అయితే తమను చర్చల్లో భాగం చేయకుంటే ఆ చర్చలకు అర్థం ఉండదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలస్కా భేటీలో జెలెన్‌స్కీకి చోటు ఉంటుందా? లేదంటే ట్రంప్‌తో విడిగా భేటీ అవుతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
#WATCH | Washington, DC | On Russia-Ukraine war and meeting with Russian President Vladimir Putin, US President Donald Trump says, "This could have been a third world war... I thought it was very respectful that the president of Russia is coming to our country, as opposed to us… pic.twitter.com/rrOyuRkFTG
— ANI (@ANI) August 11, 2025