మరికొన్ని గంటల్లో వైట్‌హౌజ్‌కు ట్రంప్‌ బైబై

Trump say bye bye to White House - Sakshi

వాషింగ్టన్‌: ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అధికారాన్ని బదిలీ చేయకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన​ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మెట్టు దిగారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తన వీడ్కోలు సమావేశంలో మంగళవారం ట్రంప్‌ మాట్లాడారు. శ్వేతసౌధంలో నిర్వహించిన చివరి కార్యక్రమంలో ఆయన తన పదవీకాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు కొత్తగా రాబోయే అధ్యక్షుడికి కొన్ని సూచనలు చేశారు. నాలుగేళ్ల కిందట దేశాన్ని పునర్నించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని.. కొత్త ఉత్సాహం, ఉత్తేజంతో పౌరులకు ప్రభుత్వం చేరువ చేయాలనే ఉద్దేశంతో పని చేశామని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడిగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. కొత్తగా వచ్చే అధికార యంత్రాంగం అమెరికాను సురక్షితంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. వారికి మా శుభాకాంక్షలు’’ అంటూ ట్రంప్‌ శ్వేతసౌధం వీడుతూ బైడెన్‌కు స్వాగతం పలికారు.

తాను ఈ అద్భుతమైన ప్రాంతం నుంచి నమ్మకం, సంతోషకరమైన హృదయంతో, ఆశావాద దృక్పథంతో వెళ్తున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో తన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని ప్రస్తావించారు. చైనాతో వైఖరి, తనపై సోషల్‌ మీడియా నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. అయితే సమావేశంలో ఎక్కడ కూడా జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని అంగీకరించకపోవడం గమనార్హం. అనంతరం అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ కూడా మాట్లాడారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొనడం లేదు. ఆ సంప్రదాయాన్ని పాటించకుండా శ్వేతసౌధం వదిలేసి ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్తున్నారు. అయితే బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈరోజు రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top