ట్రంప్ స్వీయ క్షమాభిక్ష..?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడే ముందు మరో అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపేయాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్షమాభిక్షకి గల సాధ్యా«సాధ్యాలపై సలహాదారులతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. క్షమాభిక్షతో ఎదురయ్యే పర్యవసానాల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
కుటుంబానికి క్షమాభిక్షకు వ్యూహరచన
క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్‌కి చట్టపరంగా కూడా ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ముందున్న ఏకైక మార్గం స్వీయ క్షమాభిక్ష అని యోచిస్తున్నారు. కేవలం తనొక్కడినే కాకుండా కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ ట్రంప్ సహా కుటుంబ సభ్యులందరికీ క్షమాభిక్ష పెట్టడానికి వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో ట్రంప్ అధ్యక్షుడి హోదాలో కొందరికి క్షమాభిక్ష పెట్టనున్నారు. అదే సమయంలో తనని తాను క్షమించుకున్నట్టు ప్రకటించుకుంటే పదవి వీడాకా ఎలాంటి సమస్యలు ఎదురుకావన్న భావనలో ట్రంప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
చట్టపరంగా వీలవుతుందా ?
అమెరికా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు కూడా ఇలా తనని తాను క్షమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో అమెరికా చట్టాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు మాత్రం స్వీయ క్షమాభిక్షకు అవకాశం లేదంటున్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారి వాదన. చట్టాల్లో స్వీయ క్షమాభిక్షపై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ ఏదైనా చేయవచ్చునని డ్యూక్ లా ప్రొఫెసర్ జెఫ్ పావెల్ అన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ జొనాథన్ టర్లీ కూడా ట్రంప్ స్వీయ క్షమాభిక్షను ఎవరూ ఆపలేరన్నారు.
మూడేళ్ల క్రితం నుంచి..
అధ్యక్షుడికి తనని తాను క్షమించుకునే హక్కు ఉంటుందంటూ మూడేళ్ల క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపింది. రాజ్యాంగ నిపుణులు అధ్యక్షుడికి స్వీయ క్షమాభిక్ష హక్కు ఉందని తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.