యుద్ధనౌకలను పంపబోం | Trump fails to convince European allies to help in war with Iran | Sakshi
Sakshi News home page

యుద్ధనౌకలను పంపబోం

Mar 18 2026 4:36 AM | Updated on Mar 18 2026 4:39 AM

Trump fails to convince European allies to help in war with Iran

మీరు చేసే యుద్ధంతో మాకేం సంబంధం లేదు

ట్రంప్‌కు ముఖంమీదే చెప్పేసిన నాటో, మిత్రదేశాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం పిలుపిస్తే అందరూ కట్టకట్టుకుని వస్తారని కలలుగన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భంగపాటు ఎదురైంది. హార్మూజ్‌ జలసంధి గుండా నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరిస్తున్న ఇరాన్‌కు మనందరి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో బదులివ్వాలంటూ నాటోలోని సభ్యదేశాలు, ఇతర మిత్రదేశాలకు పిలుపునిచ్చిన ట్రంప్‌కు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. పైగా చైనా షరతులు విధించి ట్రంప్‌కు మరింత కోపం తెప్పించింది. యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ మిత్రదేశాలు ముఖంచాటేయడంతో ట్రంప్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. 

అసలేం జరిగింది? 
గట్టున కూర్చుని ఇరాన్‌ చేస్తున్న బెదిరింపులకు భయపడకుండా హార్మూజ్‌ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటో దేశాలు, మిత్రదేశాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు యుద్ధనౌకలు, డ్రోన్లు పంపే ఆలోచనే లేదు. అమెరికా, యురోపియన్‌ యూనియన్, గల్ఫ్‌లోని మిత్రదేశాలతో చర్చించాకే బ్రిటన్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది’’అని అన్నారు.

‘‘అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదు. శక్తివంత అమెరికా నేవీ యుద్ధనౌకలు చేయలేని పనిని యురోపియన్‌ యుద్ధనౌకలు పూర్తిచేయగలవా?’’అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పోస్టోరియస్‌ అన్నారు. ‘‘పరిస్థితి కాస్తంత సద్దుమణిగాకే చమురునౌకలకు రక్షణగా మా యుద్ధనౌకలను పంపగలం’’అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తెగేసి చెప్పారు.  

జలసంధిలో జలసమాధి కావాలా? 
‘‘ఇప్పటికప్పుడు యుద్ధనౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యురోపియన్‌ యూనియన్‌ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. హార్మూజ్‌ జలసంధిని తెరపించడం కోసం మేం జలసమాధి కావాలా? మా దేశాలపై బాంబుదాడులు అవసరమా?’’అని ఐరోపా సమాఖ్య విదేశాంగ విధానాల విభాగ చీఫ్‌ కాజా కల్లాస్‌ తెగేసి చెప్పారు. ‘‘ముందుగా ఇరువైపులా సైనిక చర్యలను తక్షణం ఆపేయాలి. దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధనౌకలను పంపడంపై ఆలోచిస్తాం.

యుద్దం ఇలాగే కొనసాగితే చమురు సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తప్పవు’’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పారు. ‘‘పార్లమెంట్‌ ఆమోదం లేకుండా యుద్ధనౌకలను హార్మూజ్‌కు పంపడం కుదరదు. కొరియన్ల భద్రత, ముడిచమురు రావాణామార్గాల రక్షణే మాకు ముఖ్యం’’అని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్‌గుయీ బాక్‌ చెప్పారు. ‘‘ఎస్కాట్‌గా యుద్ధనౌకలను పంపాలని మాకు ఎవరి నుంచీ అభ్యర్థన రాలేదు’’అని జపాన్‌ నూతన మహిళా ప్రధాని సనాయీ తకైచీ అన్నారు. మార్చి 19వ తేదీన ఆమె వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీకాబోతున్న వేళ అమెరికా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  

ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్‌ 
సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగ్రహం మిత్రదేశాలపై ట్రంప్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో మంగళవారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్‌ ఉగ్రరాజ్యంపై దాడులకు మాతో కలిసి రాబోమని తాజాగా నాటో సభ్యదేశాలు చావుకబురు చల్లగా చెప్పాయి.  నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా వందల బిలియన్‌ డాలర్లను ధారపోసింది. ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న నాటో సభ్యదేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా. కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేరు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది.  ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు  సాయం చేయలేదు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదు’’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement