పారిస్‌లో ఒప్పందంపై సంతకం చేస్తున్న ట్రంప్, పక్కన రుబియో , టెహ్రాన్‌లో సంతకం చేస్తున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
అవగాహనా ఒప్పందంపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు
ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటన
షెడ్యూల్ కంటే ముందే వెర్సెయిల్స్, టెహ్రాన్‌లో సంతకాలు పూర్తి
తుది ఒప్పందంపై రాబోయే 60 రోజులపాటు చర్చలు
నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్, పశ్చిమాసియా దేశాల ప్రతినిధుల సమావేశం
ఎవియన్–లెస్–బెయిన్స్/దుబాయ్/వాషింగ్టన్: ప్రపంచ దేశాలను అష్టకష్టాలకు గురిచేస్తున్న పశ్చిమాసియా యుద్ధం ముగిసిపోయింది. యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి.
దీనికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్’అని పేరుపెట్టారు. నిజానికి ఇదొక మధ్యంతర ఒప్పందమే. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు ప్రతిదాడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాల నిలిపివేతపై తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబోయే 60 రోజులపాటు చర్చలు జరుగుతాయి. తుది ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులు మళ్లీ ప్రారంభించే వెసులుబాటును ట్రంప్ తన గుప్పిట పెట్టుకున్నారు.
ఇక స్వేచ్ఛగా చమురు విక్రయాలు
షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉండగా, స్థానిక కాలమానం ప్రకారం బుధవారమే ఫ్రాన్స్‌లో ట్రంప్ సంతకాలు చేశారు. రాజధాని పారిస్‌లోని వెర్సెయిల్స్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ఇచ్చిన విందు సందర్భంగా అవగాహనా ఒప్పందం భౌతిక ప్రతిపై(ఫిజికల్ కాపీ) ట్రంప్ లాంఛనంగా సంతకం చేశారు. అదే సమయంలో ఇరాన్‌లో అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒప్పందం ప్రతిపై సంతకం పెట్టారు. రెండు సంతకాలతో కూడిన పత్రాన్ని పెజెష్కియాన్ ప్రదర్శిస్తున్న చిత్రాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది.
ఒప్పందం పూర్తి వివరాలను అమెరికా, ఇరాన్‌లు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇరుదేశాలు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి. ఆ దేశంపై ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. ఇరాన్ తన ముడి చమురును తక్షణమే స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునరి్నర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్లను అమెరికా అందిస్తుంది. ఈ అగ్రిమెంట్‌ను జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్‌కు ఎక్కువ, అమెరికాకు తక్కువ లబ్ధి చేకూరేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడే సంతకం పూర్తయ్యింది: ట్రంప్
ట్రంప్ సంతకం చేసిన వీడియోను వైట్‌హౌస్ సిబ్బంది ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఇందులో ట్రంప్, మేక్రాన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఫిజికల్ కాపీపై సంతకం పూర్తయిన తర్వాత ట్రంప్ ఆ డాక్యుమెంట్‌ను, సంతకం చేయడానికి ఉపయోగించిన పెన్నును అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అందజేశారు. ఆ గదిలో ఉన్నవారంతా చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. సంతకం కంటే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘ఇది అంత సులభం కాదు’అని వ్యాఖ్యానించారు. సంతకం చేసిన తర్వాత వెర్సెయిల్స్‌లో విందు ముగించుకొని బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు.
‘ఇరాన్‌తో కుదిరిన అవగాహనా ఒప్పందంపై ఇప్పుడే సంతకం పూర్తయ్యింది’అని చెప్పారు. ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత ఆదివారం డిజిటల్ విధానంలో సంతకాలు చేశారని అమెరికా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఒప్పందంపై సంతకం చేశారు. ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలతో కూడిన ఒప్పంద పత్రాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, డిజిటల్ సంతకంతో కూడిన ఒప్పందం, భౌతిక సంతకంతో కూడిన ఒప్పందం మధ్య వ్యత్యాసం ఏమిటన్న దానిపై అమెరికా ఇంకా స్పందించలేదు.
అధికారిక హామీదారుగా షెహబాజ్ షరీఫ్
డొనాల్డ్ ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేసిన తర్వాత.. యుద్ధాన్ని ముగించే ఈ అవగాహనా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రెండు దేశాల మధ్య ఇన్నాళ్లూ ఆయన మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’గా ఆయన అభివరి్ణంచారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించినందుకు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీలను షరీఫ్ ప్రశంసించారు. హార్మూజ్ జలసంధి వెంటనే తిరిగి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవుపై దిగ్బంధనాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని ప్రకటించారు.
ఒప్పందం విషయంలో తమకు సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్ వంటి పశ్చిమాసియా దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘దౌత్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న దృఢమైన నిబద్ధత, శాంతియుత పరిష్కారానికి ఆయన చూపిన చొరవ పశ్చిమాసియాలో వినాశకరమైన పరిణామాలకు అడ్డుకట్ట వేశాయి’’అని ఉద్ఘాటించారు.
అమెరికా, ఇరాన్‌ల అత్యున్నత దౌత్య బృందం కృషి వల్లే ఒప్పందం సాకారమైందని కొనియాడారు. ఈ అవగాహన ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి, శ్రేయస్సుకు శాశ్వత పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’పై షెహబాజ్ షరీఫ్ కీలక మధ్యవర్తిగా గురువారం సంతకం చేశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అధికారికంగా హామీదారుగా షరీఫ్ సంతకం చేసినట్లు సమాచారం.
స్విట్జర్లాండ్ సమావేశం యథాతథం!
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఈ నెల 19న ఒప్పందంపై సంతకాలు చేయడానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించాయి. అయితే, షెడ్యూల్ కంటే ముందే సంతకాల కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ స్విట్జర్లాండ్ సమావేశం శుక్రవారం యథాతథంగా జరుగుతుందని సమాచారం. అమెరికా, ఇరాన్‌లతోపాటు పశ్చిమాసియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అవగాహనా ఒప్పందం అమలుతోపాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.
ఎవరికెంత లాభం?
అవగాహనా ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో ఎవరికెంత లాభం అనే చర్చ మొదలైంది. హార్మూజ్ జలసంధి దాదాపు తెరుచుకున్నట్లే. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించబోతున్నాయి. తక్షణ లాభం మాత్రం ఇరాన్‌కే అని చెప్పొచ్చు. ఆ దేశం తమ చమురును ప్రపంచ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విక్రయించుకోనుంది. భారీగా ఆదాయం గడించనుంది. ఆంక్షలు లేవు కాబట్టి బహిరంగంగానే వ్యాపారం చేసుకోవచ్చు. కొత్త మార్కెట్లకు చమురును సరఫరా చేయొచ్చు. ధరలు కూడా పెంచే వీలుంది.
మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఎంతోకొంత లబ్ధి పొందబోతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో ఎలాంటి సుంకాలు లేకుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి. దాంతో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఉండవు. అయితే, ఎనిమిది ఏళ్ల క్రితం తాను రద్దు చేసిన 2015 నాటి అణు ఒప్పందం కంటే మెరుగైన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ సాధించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఇరాన్‌ను కట్టడి చేయగలరా? అనే అనుమానాలున్నాయి. ఇరాన్‌పై యుద్ధంతో ట్రంప్ కొత్తగా సాధించింది ఏమిటో చెప్పాలని అమెరికన్లు
ప్రశి్నస్తుండడం గమనార్హం.
హార్మూజ్‌లో మళ్లీ నౌకల సందడి
ప్రారంభమైన రాకపోకలు
న్యూయార్క్: అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ నౌకల సందడి మొదలైంది. ప్రధాన షిప్పింగ్ కంపెనీలు హార్మూజ్ గుండా తమ నౌకలను తరలించడం ప్రారంభించాయని సముద్రయాన డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జలసంధిలో చిక్కుకుపోయిన ప్రముఖ కంపెనీల నౌకలు.. 110 రోజుల తర్వాత మొదటిసారిగా అక్కడి నుంచి ప్రయాణం ఆరంభించాయని లాయిడ్స్ లిస్ట్ ప్రధాన సంపాదకుడు రిచర్డ్ మీడ్ చెప్పారు.
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. గురువారం ఆంక్షలు తొలగిపోయాయి. ప్రధాన షిప్పింగ్ కంపెనీలైన గ్రిమాల్డి గ్రూప్, కోస్కో, నట్సెన్, ఎన్‌వైకే నియంత్రణలో ఉన్న ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్ జెండా కలిగిన, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ యాజమాన్యంలోని రెండు ముడి చమురు ట్యాంకర్లు జలసంధిలోకి ప్రవేశించాయి. అయితే, హార్మూజ్‌పై ఇరాన్ అమర్చిన జల మందుపాతరలను ఇంకా వెలికితీయలేదు. దాదాపు 80 మందుపాతరలను వెలికి తీయాల్సి ఉందని చెబుతున్నారు.
హార్మూజ్ గుండా మరింత చమురు: వాన్స్
ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తేశామని జేడీ వాన్స్ గురువారం చెప్పారు. పదుల సంఖ్యలో నౌకలు ఇరాన్ ఓడరేవులకు చేరుకోవడానికి తమ సైన్యం అనుమతించిందని అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా ఇప్పుడు మరింత చమురు ప్రవహిస్తోందని చెప్పారు.
దక్షిణ లెబనాన్‌లోనే ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ఆలోచన లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్‌లో ఉన్న తమ సైన్యం ఇకపైనా అక్కడే ఉంటుందని గురువారం ప్రకటించారు. అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకం చేసిన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు.
సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం తిష్టవేసింది. దక్షిణ లెబనాన్‌లో ఒక సెక్యూరిటీ జోన్‌ను ఏర్పాటు చేయాలని, ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అది అవసరమైనంత కాలం అక్కడి నుంచి సైన్యం వైదొలగకూడదని నెతన్యాహు అన్నారు. లెబనాన్‌లో సైతం దాడులు ఆపాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. అందుకు సిద్ధంగా లేమని నెతన్యాహు సంకేతాలిస్తున్నారు.


