‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి | Sakshi
Sakshi News home page

‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి

Published Sun, Dec 26 2021 4:48 AM

South African minister objects to sale of Mandela cell key - Sakshi

జొహన్నస్‌బర్గ్‌: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని వేలం వేయడాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న జరగనున్న ఓ ప్రైవేట్‌ వేలంపాటలో ఆ తాళం చెవికి ధర కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.

అసలు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుం డా వేలంవేయడ మేంటని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. మండేలాకు చెందిన కళ్లద్దాలు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలూ వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామన్నారు. మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్‌ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్‌ ఉన్నాడు.

మండేలాకు, క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో .. రాబిన్‌ ద్వీపానికి టూర్‌ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్‌ ఒకటి క్రిస్టో చెంతకు చేరింది. ఆ డూప్లికేట్‌ కీను అమెరికాకు చెందిన గెన్సీస్‌ ఆక్షన్స్‌ అనే వేలం సంస్థకు విక్రయించాడు. నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు కీ కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. గది మాస్టర్‌ కీ(అసలైన తాళం చెవి) జైలులోనే ఉందని, డూప్లికేట్‌కు ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని మంత్రి చెప్పారు.

Advertisement
Advertisement