పండు తెంపితే లక్షల్లో జరిమానా.. జైలుకు! | Shocking Fine For Fallen Mango Pick In This Country Details Here | Sakshi
Sakshi News home page

పండు తెంపితే లక్షల్లో జరిమానా.. జైలుకు!

May 13 2026 1:51 PM | Updated on May 13 2026 2:19 PM

Shocking Fine For Fallen Mango Pick In This Country Details Here

చెట్టుకు కాసే పండ్లలో ఒకటో, రెండో కోసుకోవడం నేరమా?.. కింద పడిన పండ్లు తీసుకోవడం పాపమా?.. కానీ, అక్కడ ఈ రెండూ చేస్తే లక్షల్లో జరిమానా విధించడమే కాదు.. ఒక లిమిట్‌ దాటితే జైలుకు కూడా పంపుతారు. ఇదెక్కడి రాజ్యం..? అనుకునేరు. అంతకంటే ముందు ఇదొకసారి చదివేయండి.. 

పబ్లిక్‌ ప్లేసుల్లో పెరిగి చెట్ల పండ్లు కోయడమో లేదంటే వాటి కింద గాలికి కిందపడిన కాయల్ని తీసుకోవడమో అక్కడ నేరంగా పరిగణిస్తారు. ఆ నేరానికి మూడున్నర లక్షల నుంచి 12 లక్షల రూపాయల దాకా జరిమానా, జైలు శిక్ష.. ఒక్కోసారి రెండూ విధిస్తారు. నిజంగా అది అంత తీవ్ర నేరమని మీరు భావిస్తున్నారా?.. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా?

సింగపూర్‌.. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ, కఠినమైన చట్టాలకు కేరాఫ్‌ కంట్రీ. అక్కడి ప్రభుత్వం ప్రజల ప్రవర్తనలో చిన్న విషయాలకే పెద్ద ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలూ ఇబ్బందిగా ఫీలవ్వకుండా ఆ నియమాలను గౌరవిస్తుంటారు.  అందుకే అక్కడి వీధులు చెత్తాచెదారం కానరాకుండా అద్దంలా తళతళ మెరిసిపోతుంటాయి. ఈ క్రమశిక్షణ వెనుక ఉన్న కఠినమైన జరిమానాలు, శిక్షలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి.

సింగపూర్‌ ప్రభుత్వం ప్రకృతి సంపదను పబ్లిక్‌ ప్రాపర్టీగా భావిస్తుంది. అందుకే వాటిని కాపాడటానికి అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక చెట్టు, ఒక పండు కూడా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. అయితే.. ఈ జరిమానాల వెనుక ఉద్దేశ్యం ప్రకృతి సంరక్షణ. చెట్లు, పండ్లు మాత్రమే కాదు పూలు కూడా ఈ సంపదలో భాగమే. వాటిని దోచుకోవడం అంటే.. వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజా ఆస్తిని దోచుకోవడంగా భావిస్తుంది. కాబట్టి చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే నియంత్రించడం కోసం ఈ కఠిన చట్టం తెచ్చింది. 

పార్క్స్‌ ట్రీస్‌ యాక్ట్‌
సింగపూర్‌లో ప్రకృతి సంరక్షణ కోసం రూపొందించిన చట్టం.. పార్క్స్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌(Parks and Trees Act). 2005 ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పబ్లిక్ ల్యాండ్, పార్కులు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు, నేచర్ రిజర్వ్‌లకు ఈ చట్టం వర్తిస్తుంది. పబ్లిక్‌ ప్లేసుల్లో పెరిగే చెట్ల నుంచి పండ్లు కోయడం లేదంటే కింద పడిన పండ్లు తీసుకోవడం నేరం. ఇందుకుగానూ  5,000 సింగపూర్‌ డాలర్లు (సుమారు రూ.3.5 లక్షలు) జరిమానా పడుతుంది. నేచర్ రిజర్వ్ లేదంటే నేషనల్ పార్క్‌లో ఈ తప్పు చేస్తే జరిమానా 50,000 సింగపూర్‌ డాలర్లు (రూ12.5 లక్షలు) వరకు పెరుగుతుంది, అలాగే 6 నెలల జైలుశిక్ష కూడా ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ప్రియాంక సిన్హా అనే భారతీయురాలి పోస్ట్ వైరల్ అయింది.

సింగపూర్‌లో నివసించే వారు ఏ నియమాలనైనా చాలా జాగ్రత్తగా పాటిస్తారు. ఒక పండు తీసుకోవడం వల్లే లక్షల రూపాయల జరిమానా పడుతుందని తెలిసి, ఎవరూ ఆ ప్రయత్నం చేయరు. ఇది ప్రజల్లో భయం ద్వారా క్రమశిక్షణను పెంచుతుంది.ఇలాంటి చట్టాల వల్లే ఆ దేశం ప్రపంచంలో అత్యంత శుభ్రంగా, క్రమశిక్షణతో ఉన్న దేశంగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement