గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు?

Save Water Holes in Golf Courses Were Closed - Sakshi

స్పెయిన్‌లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. 

గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. 

సీఎన్‌ఎన్‌ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్‌ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్‌ఆర్‌) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు.  కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్‌ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్‌ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. 

కొన్ని నెలలుగా స్పెయిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్‌లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. 
ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top