పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్‌

Russia President Vladimir Putin Reacts Nuclear Attack On Ukraine - Sakshi

రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్‌ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. అంతేకాదు.. ఉక్రెయిన్‌పై అణుదాడికి పాల్పడతారనే ఊహాగానాలపైనా ఆయన ఒక స్పష్టత కూడా ఇచ్చారు. తైవాన్‌ విషయంలో చైనా వాదనకు మద్దతు పలికిన పుతిన్‌.. అమెరికా విషయంలో సౌదీ అరేబియా వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రశంసలు గుప్పించారు. పాశ్చాత్య ఉదారవాదానికి వ్యతిరేకంగా రష్యాను సంప్రదాయవాద విలువల విజేతగా చూపించాలన్నదే తన అభిమతమని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారాయన. 

రష్యా ఆక్రమణ నుంచి ఉక్రెయిన్‌ పోరాడేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు ఆయుధాల సరఫరా చేస్తున్నాయి. ఇందులో వాళ్ల తీరు గ్లోబల్‌ వైడ్‌గా ఆధిపత్యం చెలాయించాలన్నట్లు  స్పష్టంగా కనిపిస్తోందని గురువారం జరిగిన ఓ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతేకాదు.. ఉక్రెయిన్‌ను పిచ్చుకతో పోల్చిన ఆయన.. ఆ దేశంపై అణు ఆయుధాల ప్రయోగ ఉద్దేశమే రష్యాకు లేదని స్పష్టం చేశారు. రష్యా, పాశ్చాత్య దేశాలకు శత్రు దేశం కాదని ప్రకటించిన పుతిన్‌.. అమెరికా ఆధిపత్యం ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్నారు.

అంతేకాదు.. తైవాన్‌ వ్యవహారంలో చైనా ప్రజాస్వామిక్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా జోక్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని మండిపడ్డారాయన. జాతి ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం నుంచి విమర్శలు ఎదురైనా పట్టించకోవడంపై సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు పుతిన్‌. ఇక.. వచ్చే నెల ఇండోనేషియాలో జరగబోయే జీ-20 సదస్సుకు హాజరు అయ్యే అవశం ఇంకా పరిశీలనలోనే ఉందని.. బహుశా వెళ్లవచ్చనే సంకేతాలు అందించారు.

ఇదిలా ఉంటే.. మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ సహా క్రెమ్లిన్‌ అధికారులంతా ఉక్రెయిన్‌ విషయంలో అణు యుద్ధం తప్పదనే దిశగా సంకేతాలు, హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ నడిచింది. మరోవైపు ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ప్రయోగం ఆరోపణలతో రష్యా.. అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ తరుణంలో అణు దాడి ఉండబోదని పేర్కొన్న పుతిన్‌.. అగ్రరాజ్యం సహా యూరప్‌ దేశాలను ఏకీపడేయడం గమనార్హం. 

ఇదీ చదవండి: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top