Record Heatwave In North western US Moves To Inland States - Sakshi
Sakshi News home page

అమెరికాలో భానుడి భగభగలు

Published Thu, Jul 1 2021 4:32 AM

Record heatwave in Northwestern US moves to inland states - Sakshi

వాషింగ్టన్‌
‘మేము దుబాయ్‌లో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? మండే ఎండల్ని భరించడం ఎలా? ఎన్ని ఏసీలు వేసినా చల్లబడడం లేదేంటి?’
ఇప్పుడు పశ్చిమ అమెరికా నగరవాసుల్ని కదిలిస్తే ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండవేడి తట్టుకోలేక జనం విలవిల్లాడిపోతున్నారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్, ఒరేగాన్, సలేమ్, సియాటిల్‌ నగరాల్లో ఎండలు దారుణంగా ఉన్నట్టు నేషనల్‌ వెదర్‌ సర్వీసు వెల్లడించింది. రోజురోజుకీ ఈ నగరాల్లో ఎండలు పెరిగిపోతున్నాయి. 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ‘‘పశ్చిమ అమెరికాలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర అమెరికాలో కూడా ఎండలు దంచికొట్టే అవకాశాలున్నాయి.వాతావరణం మార్పుల వల్ల పెరిగిపోతున్న ఈ ఎండల్ని ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని వాషింగ్టన్‌ గవర్నర్‌ జే ఇన్‌స్లీ చెప్పారు.

అత్యవసరమైతే తప్ప ఏసీ గదులు వీడి బయటకు రావద్దని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీసు హెచ్చరికలు జారీ చేసింది. నీళ్లు ఎక్కువగా తాగాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వాడకం పెరిగిపోవడంతో బ్లాక్‌ఔట్‌లు సంభవిస్తున్నాయి. వాషింగ్టన్, ఒరేగాన్‌లో ఎండవేడి తట్టుకోలేక డజనుకి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కాలిఫోర్నియా–ఒరేగాన్‌ సరిహద్దుల్లో కార్చిచ్చులు ఏర్పడి 600 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. మండే ఎండలకు, గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులకి ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈస్థాయి ఎండల్ని ఎప్పుడూ చూడలేదన్నారు.



కెనడాలో 84 ఏళ్ల రికార్డులు బద్దలు
కెనడాలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండే ఎండలకు రికార్డులు బద్దలైపోతున్నాయి. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో రికార్డు స్థాయిలో ఏకంగా 49.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక వెన్‌కౌర్‌ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. 84 ఏళ్ల తర్వాత కెనడాలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. బ్రిటీష్‌ కొలంబియా, అల్బెర్టా, సస్కాచ్‌వాన్, యూకన్‌ వాయవ్య ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కెనడా వాతావరణ శాఖ హెచ్చరించింది.


హీట్‌ డోమ్‌ కారణం..!
ఫసిఫిక్‌ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్‌ డోమ్‌ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్‌ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్‌ఫాదర్‌ చెప్పారు. గత 50 ఏళ్ల కాలంలో ఫసిఫిక్‌ సముద్రంలోని వాయవ్య ప్రాంతం సగటున 1.7 డిగ్రీ లు వేడెక్కిందని, అందుకే ఈ స్థాయిలో ఎండలు మండుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

Advertisement
Advertisement