పావురాల యందు ‘న్యూకిమ్‌ పావురం’ వేరయా

Racing Pigeon Named New Kim Sold For Record Price - Sakshi

చూస్తా ఉంటే.. హైదరాబాద్‌ సిటీలో గల్లీగల్లీలో తిరిగే పావురంలాగే ఉంది కదా.. కానీ న్యూకిమ్‌ అనే ఈ రెండేళ్ల రేసు పావురం ధర వింటే.. మనం కిమ్మనం.. ఎందుకంటే.. దీని ధర రూ.8 కోట్లకు పైనే.. ఈ మధ్యే బెల్జియంకు చెందిన రేసు పావురాల పెంపకందారుడు తన దగ్గర ఉన్న పావురాలను ఆన్‌లైన్‌లో వేలం వేస్తే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి న్యూ కిమ్‌కు ఈ వెల చెల్లించి పాడుకున్నాడు. రెండేళ్లే కానీ.. ఈ పావురం చాలా రేసుల్లో పాల్గొని గెలిచిందట.. దీని అమ్మ, అక్క కూడా రేసుల్లో గెలిచినవేనట.. అయితే ఇంత ధర ఇచ్చి.. దీన్ని రేసుల్లో వాడకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. అక్కడ గాయపడినా.. ఏం జరిగినా.. ఇంత సొమ్మూ బూడిదలో పోసినట్లు అవుతుందని.. ఇలాంటి మేలు జాతి పావురాల పునరుత్పత్తికి దీన్ని వినియోగించవచ్చని చెబుతున్నారు.

ఏ ఫిష్‌ అండ్‌ ద ఫిషర్‌ మ్యాన్‌ 
గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడం కామనే.. కానీ ఏకంగా చేపే ఇరుక్కుంటే.. ఏమవుతుంది? ఏమో మనకేం తెలుస్తుంది.. ఈజిప్టుకు చెందిన మత్స్యకారుడిని అడిగితే తెలుస్తుంది.. శ్వాస అందక.. మాట రాక.. తెగ ఇబ్బందిపడిపోయాడట.. కాస్త ఆగితే.. పోయేటట్లు ఉన్నాడని వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన బెనీ సుయిఫ్‌ పట్ట ణంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అలీ అల్‌ హజ్రీ అనే డాక్టరుగారు.. మంచి హస్తవాసి.. ఆయనే ఎండోస్కోపీ సాయంతో ఇదిగో ఇలా గొంతులోని చేపను బయటకు తీశారు.. కొంచెం లేటైనా.. ఇతడి ఫొటోకు దండ పడేదని.. సమయానికి తేవడంతోనే ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్‌గారు చెప్పారు. ఇంతకీ ఇతడి గొంతులోకి చేప ఎలా వెళ్లిందో తెలుసా?  నైలు నది ఒడ్డున ఎర వేసి చేపలు పడుతున్న మనోడికి ఈ చిన్న ఫిష్‌ చిక్కిందట. దాన్ని ఓ చేత్తో పట్టుకుని.. ఉన్నంతలోనే మరో ఎరకు కూడా చేప చిక్కిందట.. దీన్ని చేత్తో పట్టుకుని.. తీయాలంటే అవడం లేదు.. దాంతో ఆ చేపను మిస్‌ చేయకూడదని.. ఈ చేపను అలా నోట్లో పెట్టుకున్నాడట.. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో.. మేం మీకు చెప్పాలా ఏంటి..

ఈ చిన్నది చిక్కదు దొరకదు
వలలో ఎంత పెద్ద చేప పడితే.. అంత గొప్ప.. మరీ చిన్న చేప పడిందనుకోండి.. ఇక చిన్నతనమే అన్నట్లు.. జపాన్‌లో మాత్రం అలా కాదు.. అక్కడ ఎంత చిన్న చేప పట్టగలిగితే.. అంత గొప్ప అన్నట్లు.. ఎందుకంటే.. సూక్ష్మ కళలో జపానోళ్లు సుప్రసిద్ధులు కదా.. గార్డెనింగ్‌ నుంచి ఇటు ఆర్కిటెక్చర్‌ వరకూ.. అందరికీ తెలిసిందే.. అలాగే చేపలు పట్టడం విషయంలోనూ.. అక్కడ నువ్వు ఎంత చిన్న చేపను పట్టగలిగితే.. నీకు అంత నైపుణ్యం ఉన్నట్లన్నమాట. దీన్ని టనాగో ఫిషింగ్‌ అంటారు.. చేపలు పట్టడంలో జపాన్‌లో ఇదో పురాతన ప్రక్రియ. అలాగని.. వీటిని పట్టడం అంత ఈజీ కానే కాదు.. అందుకే వీటికి ప్రత్యేకమైన ఎరలు సిద్ధం చేస్తారు. బోలెడంత ఓపిక, నైపుణ్యం అవసరం.. ఇక్కడెలా ఉన్నా.. అతి చిన్న చేప పట్టావంటే.. నువ్వక్కడ తోపు అన్నట్లే..   
సో.. స్మాల్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top