
తన లక్ష్యాలను వివరించిన పోప్ లియో 14
ఫ్రాన్సిస్ ప్రాథమ్యాలను కొనసాగిస్తానని వెల్లడి
వాటికన్ సిటీ: మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సవాళ్లలో కృత్రిమ మేధ(ఏఐ)ఒకటని నూతన పోప్ లియో 14 పేర్కొన్నారు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ అనుసరించిన ప్రాథమ్యాల్లో కొన్నిటిని తానూ కొనసాగిస్తానని ప్రకటించారు. శనివారం వాటికన్ సిటీలోని సినోడ్ హాల్‌లో కార్డినల్స్ ను ఉద్దేశించి ఆయన ఇటాలియన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్సిస్ పేరును పదేపదే తలచుకుంటూ నివాళులర్పించారు.
2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఫ్రాన్సిస్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. కేథలిక్ చర్చిని మరింత సమ్మిళితంగా మార్చేందుకు విశ్వాసులకు దగ్గరయ్యేందుకు, తిరస్కృతులను అక్కున చేర్చుకునేలా తయారు చేసేందుకు కట్టుబడి ఉంటానన్నారు. చర్చిని ఆధునీకరించేందుకు 1960ల్లో వాటికన్ రెండో కౌన్సిల్ ప్రకటించిన సంస్కరణలను అమలు చేస్తానని స్పష్టం చేశారు.
‘మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఏఐ ఒకటి. ఇది మనిషి గౌరవం, న్యాయం, శ్రమను రక్షించడంలో సవాళ్లు విసురుతోంది’అని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సైతం ఏఐతో తలెత్తనున్న సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అడ్డుకునేందుకు చట్టాలు చేయాలని ప్రపంచ దేశాలను సైతం ఆయన కోరారన్నారు. లియో 14గా తన పేరును ఎంపిక చేయడంలో ఏఐ పాత్రను ఆయన వివరించారు. 1878–1903 వరకు పోప్‌గా లియో 13 కొనసాగారు.
ఆధునిక కేథలిక్ సామాజిక ఆలోచనకు పునాది వేసిందీయనే. పారిశ్రామికీకరణ ప్రారంభంలో కారి్మకుల హక్కులు, పెట్టుబడిదారీ విధానాన్ని ఉద్దేశించి 1891లో ఈయన రోమన్ కేథలిక్ చర్చి బిషప్‌లకు రాసిన లేఖ ప్రముఖంగా మారింది. లియో 13 పేర్కొన్న విధంగా ‘క్రైస్తవులం మనం అనేకులమైనప్పటికీ, ఒకే క్రీస్తులో మనమంతా ఒక్కటే’అన్న సెయింట్ ఆగస్టీన్ మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు.
అంతకుముందు, ప్రసంగించేందుకు వస్తున్న లియో 14కు కార్డినల్స్ అంతా లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. పోప్ తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ మధ్యమధ్యలో తలెత్తి చూశారు. సెయింట్ పీటర్స్ బసిలికా వేదిక నుంచి గురువారం రాత్రి మొట్టమొదటి సారిగా కనిపించిన సమయంలో కూడా ప్రసంగ పాఠాన్నే చదివి వినిపించారు.