దొంగను పట్టించిన దోమ! 

Police In China Catch Burglar Using DNA From Blood In Dead Mosquito - Sakshi

వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమేనండోయ్‌! ఇంతకీ విషయం ఏమిటంటే.. తూర్పు చైనాలోని ఫూజియాన్‌ ప్రావిన్సులో ఉన్న ఫుజోలో ఓ దొంగ ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఖాళీగా ఉన్న ఇంటిని ఎంచుకొని బాల్కనీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే బాగా ఆకలితో ఉండటంతో ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, న్యూడుల్స్‌ కనబడటంతో ఎగ్‌ న్యూడుల్స్‌ చేసుకొని లాగించేశాడు.

ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు. కానీ ఇల్లంతా దోమలమయం కావడంతో అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ఓ మస్కిటో కాయిల్‌ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుడుతుండటంతో కొన్నింటిని టపీటపీమంటూ చంపేశాడు. తెల్లవారుజాము దాకా ఇంట్లోనే ఉండి అందినకాడికి దోచుకెళ్లాడు. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. డీఎన్‌ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం చాయ్‌ అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్న అతను ఆ ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు కూడా చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top