భాగస్వామ్యం సమున్నతంగా  | PM Narendra Modi discuss bilateral cooperation with Slovakia PM | Sakshi
Sakshi News home page

భాగస్వామ్యం సమున్నతంగా 

Jun 16 2026 5:09 AM | Updated on Jun 16 2026 6:30 AM

PM Narendra Modi discuss bilateral cooperation with Slovakia PM

భారత్, స్లోవేకియా మధ్య సత్సంబంధాలు బలోపేతం 

కుదిరిన 11 ఒప్పందాలు 

స్లోవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫీకోతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

బ్రటిస్లావా: జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్‌ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’స్థాయికి ఉన్నతీకరిస్తున్నట్లు చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో పరస్పర సహకారం, వాణిజ్యం బలోపేతమే లక్ష్యంగా 11 కీలక ఒప్పందాలను ఇరుదేశాల అగ్రనేతలు కుదుర్చుకున్నారు. 

వలసలు, డిజిటల్‌ సాంకేతికత, రక్షణ, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూనికేషన్స్‌ మొదలు పలు రంగాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధం పటిష్టతే లక్ష్యంగా వీలైనంత త్వరగా ఇండియా–యూరప్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు కృషిచేయాలని ఇరు నేతలు అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక, బహుముఖ సహకారం మరింత పెరగాలి. అందుకే బంధాన్ని సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నాం. 

సమగ్ర భాగస్వామ్యం అనేది మన రెండు దేశాల ఉమ్మడి విశ్వాసాలు, ప్రాధమ్యాలు, ఉమ్మడి భవిష్యత్‌కు ప్రతీక. తాజా చర్చలు రెండు దేశాల బంధాన్ని మరింత సమున్నత శిఖరాలకు చేర్చాయి. అణు శక్తి, జియోథర్మల్‌ విద్యుత్‌ వంటి ఇంధన వనరుల ద్వారా ఇంధన భద్రత, సుస్థిరత, స్వావలంభన సాధిద్దాం. మన ఉమ్మడి సామర్థ్యం అమోఘం. మన సంకల్పాలు అత్యున్నతం. 

ఆటోమొబైల్స్, రైల్వేలు, అధునాతన తయారీకేంద్రాలు, హరిత సాంకేతికతలకు అధిక ప్రాధాన్యతనిద్దాం. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కలిసి ముందడుగువేద్దాం. భారత్‌–ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి స్లోవేకియా సమ్మతి తెలిపింది. ఒప్పందం అమల్లోకి వస్తే ఇరుదేశాల్లోని పరిశ్రమలు, అంకుర సంస్థలు, వాణిజ్యం మునుపెన్నడూలేనంతగా ప్రయోజనం పొందటం ఖాయం’’అని మీడియా సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ అన్నారు. 

రక్షణరంగంలో సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ(ఎల్‌ఓఐ)పై నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి వంటి ఉమ్మడి వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికొచ్చాయి. ఇరుదేశాల మధ్య కారి్మకులు, వలసదారుల తరలింపుపైనా ఒప్పందం కుదిరింది. కారి్మకుల సంక్షేమ భద్రతా ఒప్పందాన్ని రెండు దేశాలు కుదుర్చుకున్నాయి. స్లోవేకియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే కావడంతో ఆదివారం రాత్రి దేశ రాజధానిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. హోటల్‌ వద్ద విదేశాంగ మంత్రి జురాజ్‌ బ్లానర్‌ సాదరంగా ఆహ్వానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement