నాలుగు ఆకుల కోసం రూ. 4 లక్షలు

Plant With Only 4 Leaves Just Sold For 4 Lakh Rupees - Sakshi

అరుదైన జాతి మొక్క కోసం 4 లక్షలు వెచ్చించిన వ్యక్తి

వెలింగ్టన్: ఉదాహరణకు మన దగ్గర ఓ నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి.. ఏం చేస్తాం. కారు తీసుకుంటాం.. లేదా తక్కువకు దొరికితే ల్యాండ్‌ తీసుకుంటాం.. అది కాదంటే విహారయాత్రకు వెళ్తాం. జాగ్రత్తపరులైతే.. బ్యాంకులో ఫిక్స్‌డ్‌ చేస్తారు. అంతేకానీ ఆ మొత్తం డబ్బుతో మొక్కలను మాత్రం కొనం. అది కూడా కేవలం నాలుగంటే నాలుగే ఆకులున్న మొక్కను అస్సలే కొనం. కానీ న్యూజిలాండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం నాలుగు ఆకులున్న ఓ అరుదైన జాతి మొక్కను అక్షరాల నాలుగు లక్షలు చెల్లించి కొన్నాడు. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. మరి అంత ఖరీదైన ఆ మొక్క కథేంటో చూడండి. 

ప్రత్యేకమైన రంగు ఉండే అరుదైన జాతి ఫిలోడెండ్రాన్ మినిమా మొక్కను ఒక దాన్ని న్యూజిలాండ్‌కు చెందిన ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ‘ట్రేడ్‌ మి’ వేలానికి ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క కోసం ఏకంగా చిన్నపాటి యుద్ధమే జరగింది. చివరకు ఓ అజ్ఞాత వ్యక్తి దానికి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆ మొక్క ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ మొక్కలోని నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. రంగులేని మొక్కల కంటే రంగురంగుల మొక్కలు చాలా అరుదుగా, నెమ్మదిగా పెరుగుతాయని న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇవి చాలా అరుదుగా సహజంగా సంభవిస్తాయి కనుక వీటిని ఎక్కువగా ఉద్యాన శాస్త్రవేత్తలు, కలెక్టర్లు కోరుకుంటారని తెలిపారు. (చదవండి: ముక్కులో ఇరుక్కున్న చెయ్యి: రెండేళ్ల తర్వాత..)

‘ఈ మొక్కలోని ఆకుపచ్చ రంగు సాధారణంగా ఇతర చెట్లల్లో కిరణజన్య సంయోగక్రియను అనుమతిస్తుంది. అంతేకాక దీని కాండం మీద కొత్త ఆకులు వస్తాయనే హామీ ఇవ్వలేము’ అన్నారు శాస్త్రవేత్తలు. ‘ఈ మొక్క కోసం ఇంత డబ్బు ఖర్చు చేసిన వ్యక్తి దాని విలువ పూర్తిగా తెలిసే ఉంటుంది. భవిష్యత్తులో వీటిని ప్రచారం చేయడానికి, అమ్మి లాభాలు పొందడానికి ఇప్పుడు ఇంత భారీగా వెచ్చించాడని మా అభిప్రాయం అన్నారు’ శాస్త్రవేత్తలు. ఇక ఆ అజ్ఞాత కొనుగోలుదారుడు  రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ ‘ఉష్ణమండల స్వర్గం’ కోసం ఈ మొక్కను సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top